CAG Report: మొహల్లా క్లినిక్స్‌లో కూడా అవినీతి.. సంచలన విషయాలు వెల్లడించిన కాగ్ రిపోర్టు!

ఢిల్లీలో గత ఆప్ ప్రభుత్వంపై విడుదలైన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG Report) రిపోర్టు మరో షాకింగ్ విషయం బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం ఆరోగ్య భద్రత, మౌలిక సదుపాయాల కల్పనలో ఆప్ ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చూపిందని, కరోనా సమయంలో కేంద్రం అందించిన నిధులను కూడా సక్రమంగా వినియోగించుకోలేదని సంచలనాత్మక వివరాలను కాగ్ రిపోర్టు బయటపెట్టింది. గత ఆరేళ్లుగా ఢిల్లీ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో అవినీతికి పాల్పడిందని ఈ నివేదిక స్పష్టం చేసింది.
ఆప్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మొహల్లా క్లినిక్స్’ స్కీం కింద ఏర్పాటు చేసిన ఆస్పత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవని కాగ్ రిపోర్టు (CAG Report) తెలిపింది. ఢిల్లీలోని 27 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 14 ఆస్పత్రుల్లో ఐసీయూ సదుపాయాలు లేవని, అంతేకాకుండా 16 ఆస్పత్రుల్లో బ్లడ్ బ్యాంకులు లేవని, ఎనిమిది ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా సదుపాయాలు లేవని, పదిహేను హాస్పిటల్స్‌లో మార్చురీసదుపాయం లేదని, 12 ఆస్పత్రులకు ఆంబులెన్స్ సర్వీసులు లేవని కాగ్ నివేదిక (CAG Report) వెల్లడించింది.
అలాగే, కరోనా సమయంలో కూడా ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర సేవలను సక్రమంగా అందించలేకపోయిందని స్పష్టం చేసింది. ఈ లోపాల వల్ల ప్రజలు అత్యవసర సేవలను పొందడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని కాగ్ నివేదిక (CAG Report) తెలిపింది. ఈ నివేదిక ఆధారంగా ఆప్ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో తీవ్ర అవినీతికి పాల్పడిందని, ప్రజల ఆరోగ్య భద్రతకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందించడంలో విఫలమైందని బీజేపీ (BJP) ఆరోపణలు చేస్తోంది.