Delhi CM: ఫిబ్రవరి 17న ఢిల్లీ సీఎంను ఎంపిక చేయనున్న బీజేపీ?

ఢిల్లీ కొత్త సీఎం (Delhi CM) ఎవరనే ఉత్కంఠకు సోమవారం నాడు తెర పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ.. కొత్త సీఎం ఎవరనే విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉంది. పర్వేష్ వర్మ వంటి వాళ్ల పేర్లు వినిపిస్తున్నా.. బీజేపీ మాత్రం ఎవరి పేరునూ ఢిల్లీ సీఎం (Delhi CM) అభ్యర్థిగా ప్రకటించలేదు. అయితే ఈ నిరీక్షణకు ఫిబ్రవరి 17వ తేదీన తెరపడనుందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. సోమవారం నాడు మధ్యాహ్నం 3 గంటల సమయంలో బీజేపీ కీలక నేతలంతా కలిసి లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో పాల్గొంటారని, ఈ సమావేశంలోనే ఢిల్లీ సీఎం అభ్యర్థిని (Delhi CM) డిసైడ్ చేస్తారని సమాచారం. కొత్తగా ఎన్నికైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా తమ పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో సమావేశం అవుతారట. దాదాపు 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ జయకేతనం ఎగరేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఆ పార్టీ ఛీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పలువురు కీలక నేతలు ఓటమి పాలవడం గమనార్హం.