Anna Hazare: కేజ్రీవాల్ అధికార దాహమే ఆప్‌ను ఓడించింది: అన్నా హజారే

ఢిల్లీలో ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే (Anna Hazare) స్పందించారు. హజారే మాజీ శిష్యుడు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ ఓటమికి కేజ్రీవాల్ అధికార దాహమే కారణమని అన్నా హజారే విమర్శించారు. ఆప్‌కు దక్కిన దారుణ పరాభవానికి కేజ్రీవాల్ వైఖరే ముమ్మాటికీ కారణమని ఆయన స్పష్టం చేశారు. అవినీతి రహిత పాలన అందిస్తానంటూ ఢిల్లీ పీఠం ఎక్కిన తర్వాత.. అధికార దాహంతో కేజ్రీవాల్ చేసిన పనులు చూసిన ఢిల్లీ ఓటర్లు అసంతృప్తికి గురయ్యారని, అందుకే ఆప్ ఇంత దారుణమైన ఓటమిని మూటగట్టుకుందని హజారే (Anna Hazare) వివరించారు. మూడు సార్లు ఢిల్లీ సీఎం సీటులో కూర్చున్న కేజ్రీవాల్ పై కేవలం ఢిల్లీలోనే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా అవినీతి ఆరోపణలు వచ్చాయని గుర్తు చేసిన హజారే (Anna Hazare).. ఢిల్లీ లిక్కర్ పాలసీలో కుంభకోణం ఆరోపణలు కేవలం కేజ్రీవాల్‌కే కాకుండా మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీకే మచ్చగా మారాయని అభిప్రాయపడ్డారు. అందుకే ఢిల్లీ ఓటర్లు ఇంత దారుణంగా కేజ్రీవాల్‌ను ఓడించారని అన్నా హజారే విశ్లేషించారు.