ఎయిర్‌పోర్టుల్లో తక్కువ ధరకే భోజనం.. త్వరలోనే ‘ఎకానమీ జోన్స్’ ప్రారంభం!

విమానాశ్రయానికి వెళ్లిన ప్రయాణికులు అక్కడ భోజనం చేయడానికి భయపడతారు. ఎందుకంటే అక్కడ ఉండే ధరలు అలా ఉంటాయి మరి. సామాన్యులైతే ఈ రేట్లు చూసి కడుపు మాడ్చుకుంటారేమో కానీ.. కొనడానికి మొగ్గుచూపరు. సామాన్యులకు ఎదురయ్యే ఈ ఇబ్బందులపై కేంద్ర పౌరవిమానయాన శాఖ దృష్టిసారించింది. తక్కువ ధరలకే ఆహారం, పానీయాలను విక్రయించే ‘ఎకానమీ జోన్’లను ఎయిర్‌పోర్టుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని కోసం ఇప్పటికే పౌర విమానయాన శాఖ అధికారులు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. ఎకానమీ జోన్‌లు ఆచరణలోకి వస్తే ఎయిర్‌పోర్టుల్లో సామాన్య ప్రయాణికులు తక్కువ ధరకే ఆకలి తీర్చుకోవచ్చు. అయితే ఈ ఎకానమీ జోన్‌లలో కూర్చొని తినే ఏర్పాట్లు ఉండవని అధికారులు చెప్తున్నారు. ప్రయాణీకులు ఫాస్ట్ ఫుడ్ టేబుల్స్ వద్ద నిలబడి తినాల్సి ఉంటుంది, లేదంటే పార్శిల్ తీసుకెళ్లే సౌకర్యం ఉంటుంది. ఈ ఎకానమీ జోన్ల అంశంపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పలు దఫాలు చర్చలు జరిపి, ఏకాభిప్రాయం సాధించారని తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా (ఏఏఐ), ఎయిర్‌పోర్ట్‌లలోని ఫుడ్ అవుట్‌లెట్‌లతో పాటు ఇతర ఏజెన్సీలు ఎకానమీ జోన్లను నిర్వహించనున్నాయని తెలుస్తోంది.