AAP: ఢిల్లీ తొక్కిసలాటలో నిజాలు దాచేందుకు కేంద్ర ప్రయత్నాలు: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై కేంద్ర ప్రభుత్వం నిజాలు దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపణలు చేసింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య.. అధికారికంగా ప్రకటించిన సంఖ్య కంటే వాస్తవానికి చనిపోయిన వారి సంఖ్య చాలా ఎక్కువ అని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ (AAP MP Sanjay Singh) ఆరోపించారు. “ఈ తొక్కిసలాట జరిగిందనే నిజాన్ని కూడా కప్పిపుచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇంత విషాద ఘటనను ఎంతకాలం దాచిపెట్టగలరు? ప్రభుత్వం, రైల్వే మంత్రి ఎప్పుడు బాధ్యత తీసుకుంటారు?” అని ఆయన నిలదీశారు. మహాకుంభ్ మేళా సమయంలో కూడా ఇలాంటి తొక్కిసలాట జరిగినప్పుడు, దాని తీవ్రతను తగ్గించి చూపించే ప్రయత్నాలు చేయడం బాధాకరమని సంజయ్ సింగ్ అన్నారు. ఈ విషాదం తీవ్రత తగ్గించి చూపించేందుకు రైల్వే మంత్రి ప్రయత్నించారని, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ట్వీట్ చేసిన తర్వాత మృతుల సంఖ్యను దానిలో నుంచి తొలగించారని సింగ్ (AAP MP Sanjay Singh) ఆరోపించారు.
ఈ విషాదానికి కారణం రైల్వే శాఖ చేసిన అనవసరమైన ప్రకటన అని సంజయ్ సింగ్ చెప్పారు. షెడ్యూల్డ్ రైళ్ల ఫ్లాట్‌ఫాంను 12వ నెంబర్ నుంచి 14వ నెంబర్‌కు మార్చడంతో ప్రయాణికులలో గందరగోళం ఏర్పడి, తొక్కిసలాట జరిగిందని ఆయన (AAP MP Sanjay Singh) తెలిపారు. “ఇలాంటి ప్రకటనలు తొక్కిసలాటకు దారితీస్తాయని రైల్వే శాఖకు తెలియదా? ఇది పూర్తిగా రైల్వే మంత్రి బాధ్యత” అన్నారు. మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలని కోరుతూ, వారికి తన సంతాపాన్ని తెలియజేశారు.