గత ఐదేళ్లలో విదేశాల్లో ఇప్పటి వరకు… 633 మంది భారత విద్యార్థులు : కేంద్రం

విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులు అకాల మరణాలతో మృత్యువాత పడుతున్నారు. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనారోగ్యం ఇలా పలు కారణాలతో గత కొన్నేళ్లుగా విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన అనేకమంది భారతీయ విద్యార్థులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. గత ఐదేళ్లలో ఇప్పటి వరకు 633 మంది భారత విద్యార్థులు విదేశాల్లో మరణించినట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభకు సమర్పించిన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు.
విదేశీ, వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. గత ఐదేళ్లలో మొత్తం 633 మంది ప్రాణాలు కోల్పోగా అత్యధికంగా కెనడాలో 172 మంది మృతి చెందారు. ఆ తర్వాత యూకే లో 58, ఆస్ట్రేలియాలో 57, రష్యాలో 37, జర్మనీలో 24, పాకిస్థాన్‌లో ఒకరు చొప్పున విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల విదేశాల్లో భారత విద్యార్థులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశీయుల దాడిలో కెనడాలో తొమ్మిది మంది, యూఎస్‌ఏలో 6, ఆస్ట్రేలియా, చైనా, యూకేలో ఒక్కొక్కరు చొప్పున 19 మంది మృతి చెందినట్లు మంత్రి పేర్కొన్నారు.