మళ్ళీ చక్రం తిప్పుతున్న కేటీఆర్

అధికార తెలంగాణ రాష్ట్రసమితిలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు తరువాత రాష్ట్ర మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు కీలకపాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీకి సంబంధించి ఏ నిర్ణయమైనా, మరోవైపు ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లోనూ కేటీఆర్ పాత్ర అనిర్వచనీయమైనది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై పథకరచన చేస్తూనే మరోవైపు మంత్రివర్గ విస్తరణ అనంతరం పార్టీలో తలెత్తిన అసమ్మతీయులను బుజ్జగించి దారికి తెచ్చుకోవడంలోనూ, నామినేటెడ్ పదవుల ఆశావాహులకు హామీలు ఇవ్వడంలోనూ కేటీఆర్ చురుకైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ వ్యవహారాల్లో ఒకవైపు తలమునకలైన ఆయన, మరోవైపు మున్సిపల్, పట్టణాభివద్ధిశాఖ మంత్రిగా భారీ వర్షాల వల్ల పట్టణ, నగర ప్రాంతాల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రభలిన విష జ్వరాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలకు అధికారులను పురమాయిస్తూనే, ప్రజలు వీటి బారిన పడకుండా చైతన్యపర్చడానికి కషి చేస్తున్నారు. ఇంకోవైపు ఐటీ, పరిశ్రమలమంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించడం, ఇప్పటికే నెలకొల్పిన యూనిట్లలో ఉద్యోగ, ఉపాధికల్పనకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించడం వంటి పనులలో కేటీఆర్ ఊపిరిసలపనంత బిజీ అయిపోయారు. కేటీఆర్ దినచర్యను గమనిస్తే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయన ఎంతటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీలో, ప్రభుత్వంలో ఇటీవల తలెత్తిన వివిధ సమస్యలను కేటీఆర్ ఎంత లౌక్యంగా, చాకచక్యంగా చక్కబెట్టారో నిశితంగా పరిశీలించిన వారికి ఇట్టె అవగతమై పోతుంది. మంత్రివర్గ విస్తరణకు ముందు మంత్రి ఈటల రాజేందర్, ‘గులాబి జెండాకు మేమే ఓనర్లం’ అని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
టీఆర్‌ఎస్‌లో మొట్టమొదటిసారి బహిర్గతమైన అసమ్మతిగా మంత్రి ఈటల వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెనుదూమారం రేపాయి. హుజురాబాద్‌లో మంత్రి ఈటల ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని నిమిషాల్లోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటో హోదాలో కేటీఆర్ ఆయనతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. విషయం ఏదైనా ఉంటే పార్టీ వేదికపై చర్చించాలి తప్ప బహిరంగంగా ఎలా మాట్లాడాతారని ఒకవైపు చురక అంటిస్తూనే, మరోవైపు పార్టీలో మీలాంటి సీనియర్ నేతలే ఇలా క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎలా అని హితవు పలికారు. దీంతో ఈటల తన వ్యాఖ్యలను గంటల వ్యవధిలోనే వెనక్కి తీసుకుంటూ ప్రకటన జారీ చేశారు. అలాగే మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గం నుంచి పదవి ఆశించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, తనకు ఇచ్చిన విప్ పదవిని తిరస్కరిస్తూ గన్‌మెన్లను వెనక్కి పంపించారు. ఈ సమాచారం తెలియగానే గాంధీని కేటీఆర్ తన వద్దకు పిలిపించుకొని బుజ్జగించి పంపించి వేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మైనార్టీ నాయకుడు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కూడా తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసంత ప్తితో బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ అరవింద్‌తో సమావేశమయ్యారు. ఈ ఉదంతం మీడియా చానల్స్‌లో ప్రసారం కాగానే ఆయనతో కూడా కేటీఆర్ స్వయంగా మాట్లాడారు. దీంతో మెత్తబడిన షకీల్ మాట మార్చి ఎంపీని తాను కలిసింది మర్యాదపూర్వకంగానేనని చెప్పుకొచ్చారు. మహిళా, గిరిజన సామాజిక వర్గం కోటాలో మంత్రివర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సత్యవతి రాథోడ్‌కు స్థానం లభించింది. దీంతో అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఆయన కూతురు, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత తీవ్ర అసంతప్తికి లోనయ్యారు. వీరిద్దరు ఇటీవల అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ చాంబర్‌లో భేటీ అయ్యారు. పది, పదిహేను నిమిషాల పాటు వారితో కేటీఆర్ చర్చించాక అసంతప్తితో లోపలికి వెళ్లిన వారు బయటికి వచ్చి పార్టీ తమకు న్యాయం జరుగుతుందని చెప్పడం గమనార్హం.
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక వ్యూహంపై ఆ జిల్లాకు చెందిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంచార్జీలతో ఎప్పటికప్పుడు సమావేశం అవుతూ పార్టీ గెలుపుకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఒక దఫా హుజూర్‌నగర్‌కు వెళ్లి అక్కడ పార్టీ విస్తతస్తాయి సమావేశంలో ఉప ఎన్నికకు శ్రేణులను సమాయత్తం చేసి వచ్చారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు పార్టీ నేతలను, శ్రేణులను ఏ విధంగా సమాయత్తం చేయాల్లో పార్టీ కార్యదర్శులు, మున్సిపల్ పట్టణాలు, నగరాల ఇంచార్జీలకు తెలిపారు. పార్టీ వ్యవహారాల్లో ఇంతగా బిజీ…బీజీగా ఉంటూనే మరోవైపు మరోవైపు మున్సిపల్ మంత్రిగా, ఐటీశాఖ మంత్రిగా రాష్ట్రాభివృద్ధికి కేటీఆర్ చేస్తున్న కృషి ప్రశంసనీయమైనదని చెబుతున్నారు.