పెట్టుబడులను ఆకర్షించేలా ఎపి ప్రభుత్వ చర్యలు

రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్
ఆంధప్రదేశ్‍లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటోందని, అందుకు అనుగుణంగా పాలసీలను తీసుకువస్తోందని రాష్ట్ర పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్ చెప్పారు. ఇన్‍ఫాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న కరికాల్ వలవన్, డైరెక్టర్ ఆఫ్ పోర్టస్, కాకినాడ, రాష్ట్ర ఇన్‍క్యాప్ ఎండిగా, వైస్ చైర్మన్‍గా కూడా వ్యవహరిస్తున్నారు. తెలుగుటైమ్స్కు ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. అందులో కొన్నింటిని ఇక్కడ ఇస్తున్నాము.
కోవిడ్ 19 సంక్షోభం తరువాత పారిశ్రామిక రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయనున్నారు?
రాష్ట్రంలో కోవిడ్ 19 సంక్షోభం, లాక్‍డౌన్ వల్ల అన్నీ రంగాలు ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమల రంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించారు. దీనివల్ల ఇబ్బందుల్లో ఉన్న ఎస్‍ఎంఇలకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించడంతోపాటు, మినిమం కరెంట్ డిమాండ్ ఛార్జీలను మూడునెలలపాటు రద్దు చేస్తారు. అలాగే 6-8శాతం వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు వీలుగా 200 కోట్ల రూపాయలతో నిధిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
విదేశీ పెట్టుబడులను ఎలా ఆకర్షించనున్నారు?
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటులో భాగంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా ప్రత్యేక టాస్క్ఫోర్స్ను పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన విదేశీ పెట్టుబడులను ఈ టాస్క్ఫోర్స్ గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలను తీసుకుంటుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఐదు డిజిగ్నేటెడ్ క్లస్టర్స్, పారిశ్రామిక ప్రాంతాలను తొలుత అభివ•ద్ధి చేయనున్నారు. రక్షణ, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా. హెల్త్కేర్, టెక్స్టైల్ రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే విధంగా అన్ని వసతులతో డిజిగ్నేటెడ్ క్లస్టర్స్ ఏర్పాటు అవుతాయి. ప్లగ్ అండ్ ప్లే విధానంలో విదేశీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించుకునే విధంగా ఈ క్లస్టర్స్ ఉంటాయి.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‍రెడ్డి హయాంలో ఏర్పాటుచేసిన మల్టీ ప్రొడక్ట్ సెజ్ ‘శ్రీసిటీ’ తరహాలో అన్ని వసతులతో ఐదు పారిశ్రామిక పార్కులను కూడా ఏర్పాటవుతున్నాయి. పెట్టుబడి ప్రతిపాదనలు వేగంగా వాస్తవరూపం దాల్చడం కోసం దేశాల వారీగా, రంగాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి అనుమతులు త్వరగా ఇస్తారు. ప్రతిపాదన వచ్చిన 30 రోజుల్లో పరిశ్రమకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్, మానవ వనరులను అందించే విధంగా నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్నది. కోవిడ్ 19 నేపథ్యంలో చైనా నుంచి తరలివెళుతున్న కంపెనీలను గుర్తించి రాష్ట్రానికి రప్పించే విధంగా కూడా చర్యలను తీసుకుంటోంది.
సముద్ర వ్యాపారంలో రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తోంది?
ఆంధప్రదేశ్‍ను అన్నీరంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లుగానే సముద్ర ఆధారిత రంగంలో కూడా ముందుకు దూసుకుపోయే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచన మేరకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళుతున్నాము. ఇందులో భాగంగా 4 కొత్త పోర్టుల నిర్మాణాన్ని చేపట్టి, మూడు, నాలుగేళ్ళలో పూర్తి చేయనున్నాము. అలాగే 8 ఆధునిక ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేయనున్నాము. 2024 సంవత్సరానికల్లా భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ సెజ్ గేట్‍వే పోర్టుల నిర్మాణం పూర్తి చేసి కార్గో ఎగుమతులు ప్రారంభించాలని నిర్ణయించాము.
భోగాపురం విమానాశ్రయం నిర్మాణం విషయాలేమిటి?
రాష్ట్రంలో మరో విమానాశ్రయాన్ని నిర్మించాలన్న ఉద్దేశ్యంతో భోగాపురం ఏర్‍పోర్ట్ పనులను వేగం చేయనున్నది. ఇందులో భాగంగానే ఇటీవల జిఎంఆర్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఓ?ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ఈ విమానాశ్రయం ఏర్పాటు వల్ల వైజాగ్‍కు రాకపోకలు సులువవుతాయి.
నవోదయ పథకం వివరాలేమిటి?
ఉద్యోగ, ఉపాధి కల్పనలో ముందు ఉండే.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నవోదయం పేరుతో ఓ పథకాన్ని ప్రవేశ పెట్టింది. లాక్‍డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పరిశ్రమలనే కాదు.. గతంలో మూతపడిన పరిశ్రమలను ప్రారంభించేందుకు ఆర్థిక చేయూత ఇవ్వడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో కొత్త కాన్సెప్ట్ ఏమిటంటే.. ఈ ఎంఎస్‍ఎంఈలు ఉత్పత్తి చేసే వాటిలో ప్రతి ప్రభుత్వ విభాగం ఏటా 25 శాతం తప్పనిసరిగా కొనుగోలు చేయాలనే ఉత్తర్వులు కూడా ఉంది. దాంతో ఆ పరిశ్రమలకు.. మార్కెటింగ్ సమస్య చాలా వరకూ తీరిపోనుంది.
అమెరికాలోని తెలుగువారికి మీరు చెప్పేదేమిటి?
అమెరికాలో ఎంతోమంది తెలుగువారు ఉన్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన ఎన్నారైలు ఆంధప్రదేశ్‍లో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత అమెరికా పర్యటనలోనే పిలుపునిచ్చి ఉన్నారు. ఆయన అభిమతం ప్రకారం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఎన్నారైలకు పరిశ్రమలశాఖ తరపున అవసరమైన సదుపాయాలను, సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీకు కావాల్సిన సమాచారాన్ని కూడా అందించేందుకు ఎపిఎన్‍ఆర్‍టీ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు మీరంతా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను.