ఎన్నారైలకు చేదోడువాదోడుగా ఉంటాం

అమెరికా, యుకె, మిడిల్‌ఈస్ట్‌లోని దుబాయ్, గల్ఫ్‌లాంటి దేశాల్లో ఉన్న ఎన్నారైలు, ఇండియాలో మాతృరాష్ట్రం అవతల నివసిస్తున్న తెలుగువారికి ఎలాంటి సహాయం, సహకారం కావాల్సి వచ్చిన వారికి ఎల్లప్పుడు చేదోడువాదోడులా ఉండేలా ఎపిఎన్‌ఆర్ టీ ఉంటుందని ఎపిఎన్‌ఆర్‌టీ చైర్మన్ వెంకట్ మేడపాటి అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల డాలస్‌లో జరిగిన సమ్మేళనంలో ఎన్నారైలకు భరోసా కల్పించేలా ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎన్నారైలు పాలుపంచు కోవాలని కోరారు. సొంత ప్రాంతాల్లో అభివృద్ధికోసం అడుగులు వేసే ఎన్నారైలకు ఎపిఎన్‌ఆర్‌టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని వెంకట్ మేడపాటి చెప్పారు. ‘తెలుగుటైమ్స్’కు ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.
ఎన్నారైలకు మీరెలా సహాయం చేయనున్నారు?
అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ ఉన్న ఎన్నారైలు మాతృరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతుంటారు. అలాంటివారిని గుర్తించి, వారికి అవసరమైన సహాయసహకారాలను ఎపిఎన్‌ఆర్‌టి అందిస్తుంది. వారికి చేదోడువాదోడుగా ఉంటూ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయపడుతుంది. కొత్త ఐటీ పాలసీ ఇన్వెస్టర్లకు మరింత ఫ్రెండ్లీగా ఉంటుంది. విజయవాడలో ఎన్నారైలు ఏర్పాటు చేసిన కొన్ని ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. వాళ్ళ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎపిఎన్‌ఆర్‌టీ వారికి మద్దతును ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేవారికి అనుమతులు ఇవ్వడంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూస్తాము.
గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎలా పరిష్కరించనున్నారు?
గల్ఫ్ దేశాల్లో చాలామంది వివిధ రకాల వీసాలతో వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివారిని గుర్తించి, వారిని స్వదేశానికి రప్పించడంలో కావాల్సిన సహాయ సహకారాలను ఎపిఎన్‌ఆర్‌టీ తరపున అందిస్తాము.
రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పడాలంటే సరైన నైపుణ్యం వ్యక్తులు అవసరం కదా? దానిని మీరెలా భర్తీ చేయనున్నారు?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌గారు అన్నీ చోట్లా పరిశ్రమలు రావాలని, స్థానికంగా ఉండేవారికి ఆయా పరిశ్రమల్లో ఉపాధి లభించేలా చూడాలని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా ఎపిఎన్‌ఆర్‌టీ కార్యాచరణను తయారు చేస్తోంది. ఆయా పరిశ్రమలకు తగ్గట్టుగా ఉద్యోగులు తయారయ్యేందుకు వీలుగా నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసి అందులో శిక్షణను ఇప్పించనున్నాము. టైమ్స్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ లిమిటెడ్ (టీసిఎల్‌ఎల్)ను ఇటీవల ప్రారంభించాము. దీనిద్వారా విద్యార్థుల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్నాము. టెక్స్‌టైల్స్, అక్వా, సాఫ్ట్‌వేర్ లాంటి అనేక రంగాల్లో నైపుణ్య శిక్షణను ఇప్పించేందుకు వీలుగా ట్రైనింగ్ సెంటర్లను రెడీ చేస్తున్నాము. స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగానే త్వరలో అన్నీ కాలేజీల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను కూడా పెట్టాలని ఆలోచిస్తున్నాము.
స్మార్ట్ ఎపి ఫౌండేషన్ కార్యాచరణ వివరాలు?
గ్రామాల అభివృద్ధికి ముందుకువచ్చే ఎన్నారైలకు అవసరమైన సమాచారాన్ని అందించి తోడ్పడటం, వాటర్ ప్లాంట్, హాస్పిటల్స్, స్కూల్స్, గ్రామాల అభివృద్ధికి ఎన్నారైల తోడ్పాటును తీసుకోవడం, సిఎస్‌ఆర్ ఫండ్స్ వచ్చేలా కృషి చేయడం చేస్తాము.
మిడిల్‌ఈస్ట్‌లో ఉన్న ఎన్నారైలకు బీమా భద్రత కల్పిస్తున్నారా?
ఎపిఎన్‌ఆర్‌టీ సొసైటీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకంను ఎన్నారైలందరికీ వర్తించేలా చర్యలు చేపట్టాము. ప్రమాదవశాత్తు మరణిస్తే 10లక్షల రూపాయలు ఇస్తున్నాము. గాయపడిన, లేదా అనారోగ్యం పాలైనా వారికి అవసరమైన ఆసుపత్రి చికిత్సకు కూడా చెల్లింపులు చేస్తున్నాము.
ఎన్నార్టీ ఐకాన్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏమిటి?
ఎన్నార్టీ ఐకాన్ ప్రాజెక్టును పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఇందులో ఇన్వెస్ట్ చేసిన, బుక్ చేసుకున్న ఎన్నారైలతో మాట్లాడుతున్నాము. దాదాపు 100మందికిపైగా ఎన్నారైలు ఇందులో ఇన్వెస్ట్ చేశారు. అందరినీ సంప్రదించి, వారి సూచనలు, సలహాలతో ప్రాజెక్టును పూర్తి చేయడం జరుగుతుంది.