YCP-Janasena: నాయకులు ఉన్నారు కానీ కార్యకర్తలే లేరు? రెండు ప్రధాన పార్టీలకు వెంటాడుతున్న లోటు..
రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఒక కీలక అంశం చర్చకు వస్తోంది. అది కార్యకర్తల కొరత. ఏ పార్టీ అయినా బలంగా నిలబడాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలే అసలు శక్తి. నాయకులు ఎంత పేరు ఉన్నా, గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకూ పార్టీని మోసుకెళ్లేది కార్యకర్తలేనన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కారణాలు ఏవైనా కావొచ్చు, రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు ఇప్పుడు కార్యకర్తల కొరత పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఆ పార్టీల్లో అంతర్గత చర్చలు జోరుగా సాగుతున్నాయి.
ఈ జాబితాలో ముందుగా వినిపిస్తున్న పేరు జనసేన పార్టీ (Jana Sena Party). గత ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 100 శాతం విజయాన్ని సాధించిన పార్టీకి కార్యకర్తల కొరత ఉందంటే చాలామందికి ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అదే అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు విస్తృతమైన అభిమాన గణం ఉంది. అయితే అభిమానులు ఉండటం వేరు, పార్టీ కోసం క్రమం తప్పకుండా పని చేసే కార్యకర్తలు ఉండటం వేరు అన్న అభిప్రాయం వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్‌ను అభిమానించే వారు చాలామందే ఉన్నా, పార్టీ కార్యక్రమాలు నిర్వహించే స్థాయి కార్యకర్తలు మాత్రం తక్కువగానే ఉన్నారని జనసేన నేతలే అంగీకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ తరఫున గట్టిగా మాట్లాడే వర్గం లేకపోవడం సమస్యగా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియకు అనుబంధంగా మండలాల వారీగా కార్యకర్తలను ఎంపిక చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తోంది. దీని ద్వారా గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నది లక్ష్యం.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కార్యకర్తలు కూడా జనసేన అభ్యర్థుల కోసం గట్టిగా పనిచేశారు. అయితే భవిష్యత్తులో పూర్తిగా సొంత కార్యకర్తలతోనే ఎన్నికలను ఎదుర్కోవాలన్న ఆలోచనతో జనసేన ఇప్పుడు కొత్త నియామకాలపై దృష్టి పెడుతోంది. ఇది పార్టీకి దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుందని నాయకత్వం భావిస్తోంది.
ఇక వైసీపీ (YSR Congress Party) పరిస్థితి మరింత క్లిష్టంగా ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. కార్యకర్తలు ఉన్నప్పటికీ, పార్టీ అధిష్టానం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల వారు నెమ్మదిగా దూరమయ్యారని అంటున్నారు. గత ఐదేళ్లలో కార్యకర్తలతో పార్టీ మధ్య గ్యాప్ పెరిగింది..ఈ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ అనుభవం తర్వాత పార్టీని మళ్లీ పటిష్టం చేయాలంటే కార్యకర్తలే కీలకమని వైసీపీ భావిస్తోంది.
అందుకే రానున్న ఎన్నికల నాటికి పార్టీ బేస్‌ను బలపరచేందుకు కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు కొత్తగా మరిన్ని మందిని పార్టీలోకి తీసుకురావాలన్న వ్యూహాన్ని రూపొందిస్తోంది. మొత్తంగా చూస్తే, రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో నాయకుల కంటే కార్యకర్తలే కీలక పాత్ర పోషించే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీల భవిష్యత్తు కూడా ఇప్పుడు కార్యకర్తల బలంపైనే ఆధారపడేలా మారుతోంది.






