Trump-Machado: ట్రంప్ కు నోబెల్ పతకమొచ్చేసిందోచ్…!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఎట్టకేలకు నోబెల్ శాంతి బహుమతి తీసుకున్నారు.తన కోరిక నెరవేర్చుకున్నారు. అయితే దీన్ని నోబెల్ శాంతి కమిటీ ఇవ్వలేదు. వెనెజువెలా కోసం ట్రంప్ చేస్తున్న కృషిని మెచ్చి… వెనెజువెలా విపక్ష నేత మరియా మచాడో.. తన శాంతి బహుమతిని ట్రంప్ నకు ఇచ్చేసింది. దీంతో ట్రంప్ కూడా సంతోషిస్తున్నట్లే కనిపిస్తోంది. రాదనుకున్న నోబెల్ శాంతి బహుమతి.. తన ఒళ్లో వాలేసరికి ట్రంప్ లోనూ నూతనోత్సాహం కనిపిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన నోబెల్ పురస్కారాన్ని ట్రంప్‌నకు అందజేశారు. తమ దేశ సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషికి గుర్తుగా దీనిని ఇచ్చినట్లు చెప్పారు. వెనెజువెలా భవిష్యత్తు గురించి ఆయనతో చర్చించానని, తమ దేశ ప్రజలు స్వేచ్ఛ కోసం అమెరికా అధ్యక్షుడిపై ఆధారపడొచ్చని ఆమె (Maria Corina Machado) పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరేబియన్‌లో చమురు ట్యాంకర్లను అమెరికా దళాలు స్వాధీనం చేసుకుంటున్న విషయాన్ని ట్రంప్‌తో చర్చించినట్లు సమాచారం.
మచాడోతో భేటీ కావడంపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఆమె ఇచ్చిన నోబెల్ పురస్కారాన్ని అంగీకరిస్తున్నట్లు తెలిపారు. ‘‘మచాడోతో సమావేశం కావడం గొప్ప విషయం. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న అద్భుత మహిళ ఆమె. నేను చేస్తున్న కృషికి గుర్తింపుగా తన నోబెల్ బహుమతిని నాకు అందజేశారు. పరస్పర గౌరవానికి ఇది మంచి సంకేతం. థాంక్యూ మరియా’’ అని సోషల్ మీడియాలో ట్రంప్ పోస్టు చేశారు.
తనకు లభించిన శాంతి బహుమతిని అధ్యక్షుడు ట్రంప్‌నకు ఇస్తానని మచాడో చెప్పడంపై నోబెల్ ఇన్స్టిట్యూట్ ఇటీవల స్పందించింది. ఒకసారి నోబెల్ ప్రకటించిన తర్వాత.. దానిని రద్దు, బదిలీ చేయడం లేదా ఇతరులతో పంచుకోవడం కుదరదని స్పష్టం చేసింది. కమిటీ నిర్ణయమే అంతిమమని, దీనిలో ఎటువంటి మార్పు ఉండబోదని, ఎప్పటికీ ఇదే వర్తిస్తుందని పేర్కొంది. అయినప్పటికీ మచాడో తన నోబెల్ బహుమతిని ట్రంప్‌నకు ఇవ్వడం గమనార్హం. మరోవైపు ఆ మెడల్‌ను ట్రంప్ తన వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నట్లు వైట్‌హౌస్ అధికారి వెల్లడించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.






