PM Modi: ఢిల్లీ పేలుడు కుట్రదారులను వదిలిపెట్టం: భూటాన్ నుంచి ప్రధాని మోడీ
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడి ఘటనకు బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) హెచ్చరించారు. భూటాన్ పర్యటనలో ఉన్న ఆయన.. ఆ దేశ రాజధాని థింపులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. “ఎంతో బరువెక్కిన హృదయంతో భూటాన్‌కు వచ్చా. బాంబు దాడి ఘటన దేశ ప్రజలందరినీ కలచివేసింది. బాధిత కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంటుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అన్ని సంస్థలతో చాలాసేపు సంప్రదింపులు జరిపా. మా ఏజెన్సీలు ఈ కుట్రను లోతుగా పరిశోధిస్తాయి. దీని వెనుక ఉన్న కుట్రదారులను వదిలిపెట్టం,” అని మోడీ (PM Modi) హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన భారత్-భూటాన్ మధ్య శతాబ్దాల సాంస్కృతిక బంధాన్ని కొనియాడారు. ‘వసుధైక కుటుంబం’ స్ఫూర్తితో ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న గ్లోబల్ పీస్ ఉత్సవంలో భారత్ పాల్గొందని తెలిపారు. పర్యటకులు, పెట్టుబడిదారుల సౌకర్యార్థం గెలెఫు సమీపంలో ఇమ్మిగ్రేషన్ చెక్‌పాయింట్‌ను ఏర్పాటు చేస్తామని మోడీ (PM Modi) ప్రకటించారు.







