విద్యార్థుల వీసాలపై అపోహలు వద్దు.. అమెరికా ఎంబసీ

వీసాల విషయంలో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్న విషయంపై ఎంబసీ వర్గాలు స్పందించాయి. విద్యార్థులంతా ఎలాంటి అపోహలు, భయాలు పెట్టుకోకుండా ఇంటర్వ్యూకి రావాలని సూచించాయి. ఈ విషయంపై తాజాగా ఓ అధికారి మాట్లాడుతూ వీసాల విషయంలో ఎలాంటి అనుమానాలు, సందేహాలు వద్దన్నారు. అసలు తాము అక్కడ కూర్చునేదే వీసాలు జారీ చేయడానికి అన్న విషయం మర్చిపోవద్దని చెప్పారు. అన్ని అర్హతలు కలిగిన విద్యార్థులకు వీసాలు జారీ చేయడంలో ఎలాంటి భేషజాలు ఉండవని వెల్లడించారు. అదే సమయంలో తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేసుకోవద్దన్నారు. మరోవైపు ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయని వేలాది మంది విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తు పలువురు ట్విట్టర్ ద్వారా ఎంబసీకి ఫిర్యాదు చేశారు. పదే పదే రీఫ్రెష్ చేయవద్దని ఒకవేళ చేస్తే 72 గంటల పాటు ఖాతాలు ఫ్రీజ్ అవుతయాని ఎంబసీ వర్గాలు వివరించాయి.