Trump: నిన్న భారత్.. నేడు ఖతార్.. ట్రంప్ కు మిత్రుడుగా ఉంటే దబిడిదిబిడే..

అమెరికాతో స్నేహం ఎంత విపత్కరమో ఇప్పుడు ప్రపంచదేశాలకు తెలిసివస్తోంది. ముఖ్యంగా ట్రంప్ (Trump) అయితే కౌబాయ్ లా వ్యవహరిస్తున్నారు. మిత్రుడంటూ ఆలింగనం చేసుకుంటూనే.. చేయాల్సింది చేసేస్తున్నారు. దీంతో వామ్మో ఈ ట్రంప్ తో ఎలా వ్యవహరించాలిరా బాబు అంటూ ప్రపంచదేశాలు తలపట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికాతో భుజాలు రాసుకుపూసుకు తిరిగిన దేశాలకైతే .. తత్వం బోధపడి, ఆపసోపాలు పడుతున్నాయి.
పాక్‌తో యుద్ధాన్ని ఆపానంటాడు..! అందరి సంగతీ తేలుస్తానంటాడు..! ప్రపంచంలో ఎవరూ చేయలేనివెన్నో చేశానంటూ తనకు తానే వీరతాడు వేసుకుంటాడు. తన వ్యవహారశైలితో సెటైర్లకీ సెంటర్ పాయింటవుతున్న ట్రంప్.. మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. ట్రంప్-పుష్ప స్టైల్ అంటూ ట్రెండ్ అవుతున్నారు. ఇప్పుడిదే డైలాగ్‌ను ఖతార్‌కు వినిపిస్తున్నారు ట్రంప్. ఇజ్రాయల్ దాడి గురించి ఖతార్‌కు పది నిమిషాల ఆలస్యంగా చెప్పి గేమ్ ప్లే చేశారు.
హమాస్ తిరుగుబాటుదారులే లక్ష్యంగా ఖతార్ (Qatar) రాజధాని దోహాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడికి సంబంధించి అమెరికాకు సమాచారం ఉన్నప్పటికీ.. ఖతార్‌కు ఆ విషయం చెప్పడంలో ఆలస్యం చేసింది. దాంతో ట్రంప్ డబుల్ గేమ్ ఆడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇజ్రాయెల్ చేసిన ఈ దాడిలో హమాస్ కీలక నేత ఖలీల్ అల్-హయ్యా కుమారుడితో సహా ఆరుగురు మృతి చెందారు. దాడి గురించి అమెరికాకు ముందే సమాచారం ఇచ్చామని టెల్అవీవ్ చెప్పింది. అమెరికా కూడా ఆ విషయాన్ని అంగీకరిస్తూనే.. దాడి గురించి తాము వెంటనే ఖతార్‌కు సమాచారం ఇచ్చామని సమాధానమిస్తోంది. అయితే దాడులు మొదలైన 10 నిమిషాల తర్వాత అమెరికా నుంచి తమకు కాల్ వచ్చిందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికారి తెలిపారు. పేలుళ్లు జరుగుతుండగా అమెరికా అధికారి ఒకరు ఫోన్ చేశారని వెల్లడించారు. దాంతో ట్రంప్ తమ దగ్గర దాడి గురించి సమాచారం ఉన్నా ఖతార్‌కు ఎందుకు చేరవేయలేదని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల మిత్రదేశాలతో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మిత్ర దేశమంటూనే భారత్‌పై భారీ సుంకాల మోత మోగించారు. ఇప్పుడు ఖతార్‌కు కూడా ట్రంప్ నుంచి అలాంటి చేదు అనుభవం ఎదురైంది. కాగా అమెరికా- ఖతార్‌ల మధ్య బంధం ఇటీవల బలపడింది. ఆ దేశ పాలకుల నుంచి ట్రంప్ విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా అందుకున్నారు. ఖతార్ పర్యటనలో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో అమెరికా మిత్రదేశం ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడం చర్చనీయాంశమైంది.