Russia: ఆసియా దేశాలను అణగదొక్కే ప్రయత్నం సరికాదు.. ట్రంప్ కు పుతిన్ స్వీట్ వార్నింగ్…

ప్రపంచ పెద్దన్న, తమ ఆగర్భ ప్రత్యర్థి అమెరికాకు రష్యా.. ఓకీలక సూచన చేసింది. కీలక ఆసియా శక్తులైన భారత్, చైనాలను అణగదొక్కే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు రష్యా అధినేత పుతిన్ (Vladimir Putin). ఆసియాలోని రండు అతిపెద్ద శక్తులను అణగదొక్కేందుకు ట్రంప్ ఆర్థిక ఒత్తిడిని సాధనంగా వాడుతున్నారని ఆరోపించారు. ఎస్‌సీవో సదస్సు, మిలిటరీ పెరేడ్‌లో పాల్గొన్న తర్వాత పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్(Donald Trump) పరిపాలన ఆసియాలోని రెండు అతిపెద్ద శక్తులనూ అణగదొక్కేందుకు.. ఆర్థిక ఒత్తిడిని ఒక సాధనంగా ఉపయోగిస్తుందని ఆరోపించారు. భారత్- చైనాలు భాగస్వాములని పేర్కొంటూ.. వీరి ద్వైపాక్షికాన్ని ట్రంప్ బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ‘1.5 బిలియన్ల మంది జనాభా కలిగిన భారత్, చైనాలు శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థలు. ఆయా దేశాలకు ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థలు, దేశీయ చట్టాలు ఉన్నాయి. టారిఫ్‌లతో వారిని శిక్షించే ప్రయత్నాలు చేస్తే.. అవి ఆ దేశ నాయకులను క్లిష్టతరంలోకి నెట్టేస్తాయి. ఈక్రమంలో వారిలో ఎవరైనా బలహీనపడితే.. అతని రాజకీయ జీవితం ముగిసిపోతుంది.
ఇరుదేశాల చరిత్రలో వలసవాదం వంటి కష్టతరమైన కాలం నడిచింది. వారి సార్వభౌమాధికారంపై చాలాకాలం పాటు పన్ను విధించారు. ఇప్పుడు వాటన్నింటికీ కాలం చెల్లింది. ఇంకా వాటిని అణగదొక్కేలా మాట్లాడటం సరైనది కాదు. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు.. సరైన పదాలు ఉపయోగించాలి’ అని పుతిన్ పేర్కొన్నారు. కాగా.. ఈ ఉద్రిక్తతలు త్వరలోనే ముగుస్తాయన్నారు. మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తంచేశారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో భారత్‌పై భారీగా సుంకాల భారాన్ని మోపారు ట్రంప్. ఈక్రమంలో అమెరికాలోని కొందరు నాయకులు భారత్‌పై నోరు పారేసుకుంటున్నారు. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే, భారత్‌పై విధించింది సెకండరీ సుంకాలు మాత్రమేనని ట్రంప్ అన్నారు. ఆ దేశంపై రెండు, మూడు విడతలు ఉన్నాయన్నారు. ఈక్రమంలో భారత్‌తో కలిసే ఉన్నామంటూనే.. ఆ దేశం ప్రపంచంలోనే అత్యధికంగా సుంకాలు వసూలుచేస్తుందని ఆరోపించారు.