AP Safe : మొంథా తుపాను నుంచి ఏపీ సేఫ్..!!
మొంథా తుపాను (Cyclone Montha) నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గట్టెక్కింది. ఈ తుపాను ధాటికి తీరప్రాంతంతో పాటు కోస్తా, ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని వాతావరణ శాఖ ముందు నుంచు హెచ్చరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో చంద్రబాబు (CM Chandrababu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. చంద్రబాబు ముందుచూపు, కార్యాచరణ.. విశేష ప్రశంసలు అందుకుంటున్నాయి. నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడంలో ప్రభుత్వం అనుసరించిన క్రైసిస్ మేనేజ్మెంట్ (Crisis Management) విజయవంతమైంది.
మొంథా తుపాను ముప్పు రాబోతోందని తెలియగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తూ చర్యలు చేపట్టారు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (RTGS) ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు. తుపాను ఆరంభంలో సీఎం చంద్రబాబు, దుబాయ్ పర్యటనలో ఉన్నప్పటికీ, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, తక్షణ ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావిత జిల్లాలన్నింటికీ సీనియర్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. వీరు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. సహాయక చర్యల కోసం జిల్లాలకు అవసరమైన నిధులను ముందుగానే అందుబాటులో ఉంచారు. అన్ని శాఖల ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. మంత్రులు తమ శాఖల అధికారులకు కీలక సూచనలు చేస్తూ టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. పోలీస్, విద్యుత్, మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖలను పూర్తిగా సమన్వయం చేశారు. రాష్ట్ర స్థాయిలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) పర్యవేక్షణతో పాటు, అన్ని జిల్లాల్లో, మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ ప్లాన్ సక్సెస్ అవడంలో పునరావాస కేంద్రాలకు బాధితులను ముందుగానే తరలించడం, వెంటనే స్పందించడం కీలక పాత్ర పోషించాయి. తుపాను తీరం దాటే ప్రాంతాలకు సమీపంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను, వృద్ధులను, గర్భిణీలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ తరలింపులో ఎలాంటి ఆలస్యం జరగకుండా చూశారు. సురక్షిత ప్రాంతాలకు తరలించిన వారికి అవసరమైన ఆహారం, రక్షిత తాగునీరు, పాలు, ఔషధాలు పంపిణీ చేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను తక్షణమే వెనక్కి రప్పించారు. వారికి 50 కిలోల బియ్యం పంపిణీ చేశారు.
13 ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు అదనంగా మరో 3 టీమ్‌లను తుపాను ప్రభావిత జిల్లాలకు ముందుగానే పంపించారు. ప్రాణనష్టాన్ని నివారించడానికి, తుపాను తీరం దాటే సమయంలో విద్యుత్ సరఫరాను ముందుగానే నిలిపివేశారు. గాలులు తగ్గిన వెంటనే పునరుద్ధరించడానికి బృందాలను సిద్ధం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు, ముఖ్యంగా పౌరసరఫరాల శాఖ ద్వారా రైస్, ఇతర ఆహార పదార్థాలను ముందుగానే సిద్ధం చేశారు.
ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన ముందస్తు చర్యలు, నిరంతర పర్యవేక్షణ, క్షేత్రస్థాయి సిబ్బంది వేగవంతమైన ప్రతిస్పందన వల్ల ప్రాణనష్టం లేకుండా మొంథా తుపానును ఎదుర్కోవడం సాధ్యమైంది. గాలుల తీవ్రత తగ్గగానే, కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించి, రోడ్లు, విద్యుత్ సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించారు. నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించడంలో చంద్రబాబు అనుభవం, నిపుణులైన అధికార యంత్రాంగం కృషి స్పష్టంగా కనిపించింది. వైసీపీ వంటి ప్రతిపక్షాల విమర్శలున్నా, తుపాను వంటి విపత్తును చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం నిర్వహించిన తీరుపై నెటిజన్లు, ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.







