Kavitha : కొత్తకొత్తగా… కల్వకుంట్ల కవిత..!!
కల్వకుంట్ల కవిత.. తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) కుమార్తెగా దశాబ్దానికి పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్న ఆమె, ఇటీవలే పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇప్పుడు తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రయాణంలో ఆమె అనుసరిస్తున్న తీరు, ముఖ్యంగా ఆమె ‘లుక్’లో వచ్చిన మార్పు రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీఆర్ఎస్ నుంచి దూరమైన కవిత (Kalvakuntla Kavitha) తన అస్తిత్వాన్ని పూర్తిగా మార్చుకునే ఒక ‘రీ-బ్రాండింగ్’ వ్యూహాన్ని అమలు చేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.
కవిత ఇటీవలి బహిరంగ కార్యక్రమాలలో కనిపించిన తీరు ఆమె గత రాజకీయ రూపానికి పూర్తిగా భిన్నంగా ఉంది. గతంలో జుట్టు విరబోయడమో, జడ వేసుకోవడమో చేసే ఆమె, ఇప్పుడు కొప్పు ముడి కడుతున్నారు. ఈ మార్పు ఆమె రూపాన్ని మరింత సంప్రదాయబద్ధంగా, పరిణతి చెందిన నాయకురాలిగా మార్చేసింది. తెలంగాణ పల్లెటూరి సంస్కృతిలో కొప్పుకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, సామాన్య ప్రజలు, గ్రామీణ మహిళలతో భావోద్వేగ బంధాన్ని పెంచుకోవడానికి ఇది ఒక ప్రయత్నంగా కనిపిస్తోంది. అంతేకాకుండా, ఆమె వస్త్రధారణలోనూ మార్పు వచ్చింది. ఆమె ఎక్కువగా చేనేత చీరలు ధరిస్తున్నారు. తద్వారా తెలంగాణ చేనేత కార్మికులకు మద్దతు పలికినట్లే కాక, స్థానిక సంస్కృతి, తెలంగాణ అస్తిత్వం పట్ల తనకున్న నిబద్ధతను బలంగా చాటుచెప్పినట్లవుతోంది. కొత్త రాజకీయ వేదికకు సన్నాహకంగా, ప్రజలకు మరింత దగ్గరయ్యే ఉద్దేశంతోనే ఈ లుక్ వ్యూహాత్మకంగా జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పార్టీ నుంచి బహిష్కరణ తర్వాత, కవిత సొంత సంస్థ తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ద్వారా తన కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే, 33 జిల్లాలు, 119 నియోజకవర్గాల్లో పర్యటించే లక్ష్యంతో ‘జనం బాట’ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర కేవలం పర్యటన కాదని, ఆమె కొత్త రాజకీయ ప్లాట్‌ఫామ్‌కు పునాదిగా మారుతోందని చెప్పొచ్చు. ఈ యాత్ర సందర్భంగా ఆమె ప్రజలు, ఉద్యమకారులు, మేధావులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ఈ సమాలోచనల ద్వారా లభించే స్పందన ఆధారంగానే కొత్త పార్టీ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఈ యాత్రలో గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే, ప్రచార చిత్రాలలో కేసీఆర్ ఫొటో పూర్తిగా పక్కనపెట్టేయడం. బదులుగా తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోలను ఉపయోగిస్తున్నారు. ఇది ఆమె బీఆర్ఎస్ పాలసీల నుంచి బయటికొచ్చి, సొంతంగా తెలంగాణ ఉద్యమ మూలాలను గుర్తుచేసేలా స్కెచ్ వేసినట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా ‘సామాజిక తెలంగాణ’ లక్ష్యంగా తన పోరాట పంథా మారుతుందని ఆమె ప్రకటించడం, బీఆర్ఎస్ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించి, సరికొత్త అజెండాతో ప్రజల్లోకి వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నంగా విశ్లేషించవచ్చు.
మొత్తంమీద కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకున్న తర్వాత తీసుకుంటున్న ప్రతి అడుగు ఆమెను స్వతంత్ర మహిళా నాయకురాలిగా తీర్చిదిద్దుకునేలా సాగుతున్నట్లు కనిపిస్తోంది. కొత్త లుక్ ద్వారా సంప్రదాయతను, చేనేత చీరల ద్వారా స్థానికతను, జనం బాట యాత్ర ద్వారా ఉద్యమ మూలాలను, ప్రజాభీష్టాన్ని గౌరవించేలా కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అంతేకాక, తన రాజకీయ బ్రాండ్‌ను పునర్నిర్మిస్తున్నారు. ఈ రీ-బ్రాండింగ్ వ్యూహం ద్వారా, ఆమె కొత్త పార్టీ ఏర్పాటుకు, తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి గట్టి ఏర్పాట్లు చేసుకుంటున్నారనేది రాజకీయ వర్గాల అంచనా.







