US visa : అమెరికా వీసా ఆలస్యం.. వేలాది భారత విద్యార్థులపై ప్రభావం

ఇటీవల వీసా (Visa) ఇంటర్వ్యూలపై అమెరికా నిషేధం ఎత్తివేసినప్పటికీ, వీసా ప్రాసెసింగ్‌లో అసాధారణ జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో అమెరికా విశ్వవిద్యాలయాల్లో కొత్తగా ప్రవేశం పొందిన చాలామంది విద్యార్థులు (Students) సకాలంలో అక్కడ అడ్మిషన్ పొందే అవకాశాలు కనిపించడంలేదు. వీసా ప్రాసెసింగ్‌లో ఆలస్యం, వీసా తిరస్కరణల కారణంగా గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రాబోయే సెమిస్టర్‌లో చేరే భారత విద్యార్థుల సంఖ్య 70-80శాతం తగ్గొచ్చని కన్సల్టెన్సీ నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్ సెమిస్టర్ సెప్టెంబరులో, మరికొన్ని చోట్ల ఆగస్టు చివరివారంలో మొదలవుతుంది. దీనికోసం విద్యార్థులు ఆగస్టులోనే అమెరికా (America) చేరుకుంటారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం కాన్సులర్ అధికారులు విద్యార్థి, సందర్శకుల వీసా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని అమెరికా ఎంబసీ ప్రతినిధి తెలిపారు. దరఖాస్తుదారుడు అమెరికా చట్టాల ప్రకారం వీసా పొందేందుకు అర్హుడని నిర్ధారించే కాన్సులర్ అధికారి సంతృప్తి చెందేవరకు మేం వీసా జారీ చేయం. అందుకే ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతుంది అని పేర్కొన్నారు.