అమెరికా చరిత్రలో తొలిసారిగా… ఫెడరల్ జడ్జిగా

అమెరికా చరిత్రలో తొలిసారి ఫెడరల్ జడ్జిగా ఓ ముస్లిం-అమెరికన్‍ను నియమించేందుకు సెనేట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు న్యూజెర్సీ జిల్లా కోర్టుకు పాకిస్థానీ-అమెరికన్ జహీద్ ఖురైషీ (46) నియామకాన్ని సెనేట్ 81-16 ఓట్లతో ఆమోదించింది. ప్రస్తుతం న్యూజెర్సీ జిల్లాలో మేజిస్ట్రేట్ జడ్జిగా ఉన్న ఖురైషీ జిల్లా కోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఫెడరల్ జడ్జిగా తొలి అమెరికన్ ముస్లిం బాధ్యతలు చేపట్టనుండటం చరిత్రాత్మకమని ముస్లిం పబ్లిక్ ఎఫైర్స్ కౌన్సిల్ ప్రశంసించింది. అమెరికాలోని ఘనమైన వైవిధ్యాన్ని ప్రతిబింబించే విధంగా ఫెడరల్ ప్రభుత్వ కూర్పు ఉండేలా చూసుకుంటామని బైడెన్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేరుస్తోందంటూ అభినందనలు తెలిపింది.