Ukraine: జెలెన్‌స్కీపై సొంతదేశంలో భారీ నిరసన.. ఇంతకూ కారణమేంటంటే..?

రష్యాపై వీరోచితంగా పోరాడుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి.. నిజానికి సొంతదేశంలో గట్టి సపోర్టే ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో చర్చల సందర్భంగా జెలెన్ స్కీ చేసిన వాగ్వాదం .. అక్కడి పౌరులను విశేషంగా ఆకట్టుకుంది కూడా. అయితే ఉక్రెయిన్ లో అంతా సాఫీగా ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే జెలెన్ స్కీ కొన్ని నిర్ణయాలు ప్రజాగ్రహానికి గురవుతున్నాయి. లేటెస్టుగా జెలెన్ స్కీ .. అవినీతి నిరోదక సంస్థలను బలహీన పర్చేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.
ఫలితంగా ఆ దేశ రాజధాని కీవ్‌లో భారీ ఆందోళనలు (protests in Kyiv) మొదలయ్యాయి. ఇటీవల అధ్యక్షుడు దేశంలోని యాంటీ కరెప్షన్ బ్యూరోను బలహీన పర్చే ఓ బిల్లుపై సంతకాలు చేయడంతో అంతర్జాతీయగా తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి.
ఉక్రెయిన్‌లోని నేషనల్ యాంటీ కరెప్షన్ బ్యూరో (నాబు), స్పెషలైజ్డ్ యాంటీ కరెప్షన్ ప్రాసిక్యూషన్స్ ఆఫీస్ (సోపా)ను ప్రాసిక్యూటర్ జనరల్ అధీనంలోకి తీసుకొచ్చారు. దీనిని సమర్థించుకొంటూ జెలెన్‌స్కీ (Zelensky) మాట్లాడారు. వీటిల్లో రష్యా ప్రభావాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అవినీతి నిరోధక వ్యవస్థల పనితీరు నాసిరకంగా ఉందని చెప్పారు. ‘‘చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదన్న విషయాన్ని ప్రాసిక్యూటర్ జనరల్ నిర్ధరిస్తారు’’ అని వ్యాఖ్యానించారు.
ఈ బిల్లు పాస్ అయ్యాక వేల మంది ప్రజలు కీవ్ రోడ్ల పైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. 2022లో రష్యా ఆక్రమణ చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఈ స్థాయిలో కీవ్‌లో నిరసనలు జరిగాయి. ల్వివ్, డెనిప్రో, ఒడెసాలో కూడా ప్రదర్శనలు చేపట్టారు.
‘మేము యూరప్ ను ఎంచుకొన్నాం.. అంతేకానీ నియంతను కాదంటూ నినాదాలు చేశారు ఆందోళనకారులు. ప్రజాస్వామ్యం, అవినీతి వ్యతిరేక చర్యలకు ఈ బిల్లు గండి కొట్టిందన్న విమర్శలున్నాయి. వాస్తవానికి ఉక్రెయిన్‌లోని బలమైన అవినీతి వ్యతిరేక వ్యవస్థ కారణంగానే పశ్చిమదేశాలతో సంబంధాలు మెరుగుపడటంతోపాటు.. నిధులు వస్తున్నాయి. ఈక్రమంలో యూరోపియన్ కమిషన్ ప్రతినిధి గిల్లామ్ మెర్సియర్ స్పందిస్తూ.. ఆ దేశంలోని పరిణామాలు ఆందోళనకరమన్నారు.
ప్రస్తుతం ఉక్రెయిన్ (Ukraine) చీఫ్ ప్రాసిక్యూటర్‌గా అధ్యక్షుడు జెలెన్‌స్కీకి నమ్మిన బంటుగా పేరున్న రుస్లాన్ క్రావ్చెంకో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్త బిల్లు ప్రకారం నాబులో ఉన్న రష్యా గూఢచారుల కోసం ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసు, ప్రాసిక్యూటర్ జనరల్ ఆఫీసు తనిఖీలు చేపట్టి అరెస్టు చేస్తుందన్నారు. అయితే ఇది దుర్వినియోగం అవుతుందని ఇప్పటికే పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.