1Lac drones: ఉక్రెయిన్ కు లక్ష డ్రోన్లు.. బ్రిటన్ భారీ ఆయుధసాయం..

ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా (Russia) నెగ్గే ప్రసక్తే లేదు.. అంతవరకూ రాకుండా చూద్దాం.. ఇదీ యూరోపియన్ యూనియన్ దేశాల ఉద్దేశం. ఎందుకంటే ఉక్రెయిన్ (Ukraine) పై యుద్ధం ముగిస్తే.. తర్వాత రష్యా కన్ను తమపై పడుతుందన్నది యూరోపియన్ దేశాల అనుమానం. అందుకే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా గెలవకూడదు. అక్కడితో ఆగిపోయేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మొన్నటికి మొన్న జర్మనీ.. దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్ కు అనుమతించింది. ఇప్పుడు బ్రిటన్.. ఉక్రెయిన్ కు లక్ష డ్రోన్లను సరఫరా చేస్తోంది.
ఇటీవల రష్యాలోని వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ భారీగా డ్రోన్ దాడులకు దిగింది.ఈ దాడిలో మాస్కోకు చెందిన 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. మారిన ప్రస్తుత పరిస్థితుల్లో కీవ్‌కు భారీ సంఖ్యలో డ్రోన్‌లను సరఫరా చేయడానికి బ్రిటన్ (Britain) ముందుకువచ్చింది. 2026 ఏప్రిల్ నాటికి ఉక్రెయిన్‌కు లక్ష డ్రోన్లు అందజేస్తామని హామీ ఇచ్చింది. ఆ దేశానికి ఇచ్చే 4.5 బిలియన్ పౌండ్ల మిలిటరీ మద్దతులో ఈ 350 మిలియన్ పౌండ్ల డ్రోన్ ప్యాకేజీ భాగమని పేర్కొంది. స్వతంత్రంగా ఉత్పత్తి చేసిన స్ట్రాటజిక్ డిఫెన్స్ రివ్యూను బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించింది.
రష్యన్ దురాక్రమణతో సహా ఉద్భవిస్తున్న మరిన్ని ముప్పులను ఎదుర్కోవడానికి కీవ్‌కు మిలిటరీ మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. బ్రస్సెల్స్‌లో నిర్వహించనున్న 50 దేశాల ఉక్రెయిన్ డిఫెన్స్ కాంటాక్ట్ గ్రూప్ సమావేశంలో బ్రిటన్ రక్షణ కార్యదర్శి జాన్ హీలీ ఈ ప్రకటన చేయనున్నారు. రష్యా వద్ద అపారమైన క్షిపణి సంపద ఉంది. ఆ దేశంతో పోలిస్తే ఉక్రెయిన్ దగ్గర భారీ ఆయుధాలు లేకపోవడంతో కీవ్‌ను ఆయుధాల కొరత వెంటాడుతోంది. ముఖ్యంగా గగనతల రక్షణ వ్యవస్థ లేకపోవడంతో రష్యా చేసే క్షిపణులు, డ్రోన్ల దాడులను తట్టుకోలేకపోతోంది. దీంతో రిమోట్ సాయంతో సుదీర్ఘంగా ప్రయాణించగలిగే డ్రోన్ల వ్యవస్థను అభివృద్ధి చేసుకుంది. వీటితో తాజాగా రష్యాలోని అనేక ప్రాంతాల్లో భారీ దాడులకు పాల్పడింది.
గతంలోనూ రష్యా సైనిక స్థావరాలు, చమురు బావులపై దాడులు చేసేందుకు ఉక్రెయిన్ వీటిని ప్రయోగించింది. భవిష్యత్తులో రష్యా ఆక్రమణలను ఎదుర్కోవడానికి మరిన్ని డ్రోన్లు సరఫరా చేయాలని మిత్ర దేశాలను కోరింది. మాస్కో కీవ్‌పై భీకర దాడులకు పాల్పడుతుండడంతో.. రష్యా దాడుల నుంచి తమ దేశాన్ని రక్షించుకోవడానికి పలు పశ్చిమ దేశాలు, బ్రిటన్, అమెరికా ఉక్రెయిన్‌కు ఆయుధాలను పంపిణీ చేస్తున్నాయి. ఇటీవల రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాలు ప్రయోగించకుండా ఉక్రెయిన్‌పై ఉన్న ఆంక్షలను పశ్చిమ దేశాలు తొలగించడంతో కీవ్‌కు దీర్ఘశ్రేణి ఆయుధాలు ప్రయోగించే అవకాశం లభించింది.