H-1B visa: భారతీయులకు మరో షాక్ ఇచ్చిన ట్రంప్ …హెచ్-1బీ వీసా వార్షిక రుసుం లక్ష డాలర్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) హెచ్-1బీ వీసా పై కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త హెచ్-1బీ వీసా విధానం భారత్ (India) తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనపుంది. ప్రతి హెచ్-1బీ వీసాపై ఏటా లక్ష డాలర్లు రుసుం విధించినట్లు యూఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ (Howard Lutnick) పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు. మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే ఇటీవల మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన మన వారికి ఇవ్వండి. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండి అని పేర్కొన్నారు.