Donald Trump : డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనకు మద్దతు : జెలెన్‌స్కీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపేసేందుకు చర్యలను ముమ్మరం చేశారు. అలాస్కా(Alaska) నుంచి వాషింగ్టన్ చేరుకున్న ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky), యూరోపియన్ యూనియన్ నేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. తాత్కాలిక కాల్పుల విరమణ కాకుండా శాశ్వతంగా శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని జెలెన్‌స్కీకి ట్రంప్ చెప్పారు. ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ స్పందిస్తూ రష్యా (Russia)తో యుద్ధానికి ముగింపు పలికేందుకు నిర్మాణాత్మకంగా సహకరించేందుకు తాను సిద్ధమేనని చెప్పారు. ట్రంప్ ఆహ్వానం మేరకు తాను వాషింగ్టన్ (Washington)కు వెళ్తానని తెలిపారు. యుద్ధం ముగింపు కోసం ఉక్రెయిన్, రష్యా, అమెరికా మధ్య త్రైపాక్షిక చర్చలు జరగాలని ట్రంప్ చేసిన ప్రతిపాదనకు మద్దతు పలుకుతున్నట్లు సంకేతాలిచ్చారు. పరిస్థితి మెరుగుపడటంలో అమెరికా బలం చాలా ముఖ్యమైన ప్రభావం చూపుతుందని చెప్పారు. శాంతి సాధన కోసం గరిష్ఠ స్థాయిలో కృషి చేయడానికి సిద్ధమేనని పునరుద్ఘాటించారు.