Donald Trump: ఉక్రెయిన్‌కు పూర్తి రక్షణ కల్పిస్తాం : డొనాల్డ్ ట్రంప్

ఉక్రెయిన్‌కు తాము పూర్తి రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భరోసా ఇచ్చారు. సమస్య పరిష్కారానికి త్రైపాక్షిక భేటీ జరపనున్నట్లు వెల్లడిరచారు. దానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) కూడా సమ్మతి తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియబోతోందని, అయితే అది ఎప్పుడన్నది స్పష్టంగా చెప్పలేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు శ్వేతసౌధం ఒవెల్ కార్యాలయంలో ఆయన కీలక భేటీలు నిర్వహించారు. తొలుత డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చర్చించుకున్నారు.
ఆ తర్వాత ఐరోపా నేతలతో సమవేశమయ్యారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer), ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడెరిక్ మెర్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (Georgia Meloni), ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌లెయణ్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఉక్రెయిన్‌తో పాటు ఐరోపాకూ అమెరికా నుంచి భద్రతపరంగా హామీ కావాలని ఆయా దేశాల నేతలు కోరారు. కాల్పుల విరమణకు వారు గట్టిగా ప్రతిపాదించారు. అది ఎంతవరకు ఫలిస్తుందో అనుమానమేనని, సత్ఫలితాన్ని ఇస్తుందంటే మాత్రం ఒత్తిడి తెస్తానని ట్రంప్ బదులిచ్చారు.