US: భారతీయులపై ట్రంప్ సర్కార్ అక్కసు.. అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ వీడియో విడుదల..!
 
                                    వలసదారుల మేధస్సు, ప్రజ్ఞ, శ్రమ, పట్టుదలతో సుసంపన్నమైన అమెరికా.. ఇప్పుడు ఆ వలసదారులను నిందిస్తోంది. తమ దేశాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లిన వారే.. ఇప్పుడు అగ్రరాజ్యం దృష్టిలో నేరస్తులుగా మారుతున్నారు. చట్టప్రకారం వచ్చినవారు కావడంతో నేరుగా చర్యలు తీసుకోకున్నా.. పొమ్మంటూ పొగపెడుతోంది. ఇన్నాళ్లు పరోక్షంగా ఆ విషయాన్ని ప్రస్తావించిన అమెరికా సర్కార్.. ఇప్పుడు నేరుగా ఓ వీడియో విడుదల చేసి మరీ తన నైజాన్ని చాటుకుంది.
అమెరికాలో వలసదారులు, మరీ ముఖ్యంగా ఎన్నారైల విషయంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరి మరోసారి బయటపడింది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వలసదారులను లక్ష్యంగా చేసుకుంటూ వస్తున్న ఆయన యంత్రాంగం, తాజాగా హెచ్-1బీ వీసాదారులపై దృష్టి సారించింది. ఈ వీసా విధానాన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయంటూ అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక యాడ్ వీడియోను విడుదల చేసింది.
ఈ వీడియోలో, అమెరికన్ యువత స్థానంలో కంపెనీలు విదేశీ కార్మికులను నియమించుకుంటున్నాయని తీవ్ర ఆరోపణలు చేసింది. హెచ్-1బీ వీసాల ద్వారా తక్కువ జీతాలకు విదేశీయులను పనిలో పెట్టుకుంటూ, స్థానిక అమెరికన్లకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించింది. ముఖ్యంగా, ఈ వీసా పొందుతున్న వారిలో అత్యధికులు భారతీయులే ఉన్నారని ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం.
అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ట్రంప్ వలస విధానాలపై కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అక్రమ వలసదారుల మాస్ డిపోర్టేషన్, అరెస్టులు, చట్టబద్ధమైన ప్రవేశాలపై కూడా కఠిన ఆంక్షలు విధిస్తూ వచ్చారు. అందులో భాగంగానే, భారతీయ టెకీలకు అత్యంత కీలకమైన హెచ్-1బీ వీసాను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.











 
                                                     
                                                        