New Delhi: అఫ్గానిస్తాన్ పై మీ ఆధిపత్యమేంటి..? పాక్ ఆరోపణలకు భారత్ ధీటైన కౌంటర్..
అఫ్గానిస్తాన్ కు సొంత ప్రభుత్వముంది.. తమ దేశాన్ని తాలిబన్లు పాలిస్తున్నారు. మధ్యలో మీ జోక్యమెందుకు.. వారి పాలనను వారిని చేసుకోనివ్వడం లేదెందుకు..? మీ సీమాంతర ఉగ్రవాదానికి అఫ్గాన్ భూభాగాన్ని వాడేందుకు ప్రయత్నిస్తున్నారంటూ న్యూఢిల్లీ ఆక్షేపించింది.అఫ్గాన్ (Afghanistan) సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్ర్యానికి కట్టుబడి ఉన్నామని భారత్ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పాక్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడింది. సీమాంతర ఉగ్రవాదం కొనసాగింపును ఓ హక్కుగా భావిస్తున్నట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తింది. కాబుల్‌తో చర్చలు విఫలమవడానికి భారత్ కారణమంటూ పాక్ (Pakistan) ఆరోపించిన నేపథ్యంలో విదేశాంగశాఖ ఈ విధంగా స్పందించింది.
‘‘అఫ్గానిస్థాన్ తన సొంత భూభాగాన్ని పాలించుకోవడంపై పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని యథేచ్ఛగా కొనసాగించే హక్కు ఉందని పాక్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ చర్యలను పొరుగు దేశాలు ఆమోదించవు. అఫ్గాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్ర్యానికి భారత్ కట్టుబడి ఉంది’’ అని విదేశాంగశాఖ (MEA) అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు.
అఫ్గాన్‌పై ఈ నెల ప్రారంభంలో పాకిస్థాన్ దాడులు జరపడం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. అయితే, సరిహద్దులో కాల్పుల విరమణ, సీమాంతర ఉగ్రవాదం తదితర అంశాలపై తుర్కియే వేదికగా ఇటీవల ఆ రెండు దేశాలు చర్చలు జరిపినప్పటికీ అవి విఫలమయ్యాయి. ఇదే అంశంపై పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందిస్తూ.. తాలిబన్లను భారత్ నియంత్రిస్తోందని, వాళ్లు భారత్ చేతిలో కీలుబొమ్మలుగా మారారని ఆరోపించారు. అఫ్గాన్‌తో చర్చలు విఫలమవడానికి భారత్ కారణమని అక్కసు వెళ్లగక్కారు.
“మేము ఒక ఒప్పందానికి దగ్గరైన ప్రతీసారి, ఆఫ్ఘన్ ప్రతినిధులు కాబూల్‌తో మాట్లాడిన తర్వాత వెనక్కి తగ్గారు. చర్చలను ఉద్దేశపూర్వకంగానే నీరుగార్చారు. తెర వెనుక ఢిల్లీ ఉండి ఈ తతంగాన్ని నడిపిస్తోంది” అని ఆసిఫ్ ఆరోపించారు.అఫ్ఘాన్ నాయకత్వం మాత్రం ఢిల్లీ చేతిలో కీలుబొమ్మలా మారిందని ఆయన విమర్శించారు. “కాబూల్‌లో కూర్చుని ఈ నాటకాన్ని ఆడిస్తున్న సూత్రధారులు ఢిల్లీలో ఉన్నారు. పశ్చిమ సరిహద్దులో ఎదురైన ఓటమికి ప్రతీకారంగా, ఆఫ్ఘనిస్థాన్‌ను అడ్డం పెట్టుకుని పాకిస్థాన్‌తో తక్కువ తీవ్రతతో కూడిన యుద్ధం చేయాలని భారత్ కోరుకుంటోంది” అని ఆసిఫ్ పేర్కొన్నారు.
తమపై దాడి చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆసిఫ్ హెచ్చరించారు. “ఆఫ్ఘనిస్థాన్ ఇస్లామాబాద్ వైపు కన్నెత్తి చూసినా, వారి కళ్లు పీకేస్తాం. ఇప్పటికే వారు ఉగ్రవాదులను వాడుకుంటున్నారు. పాక్‌లో జరుగుతున్న ఉగ్రవాదానికి కాబూలే బాధ్యత వహించాలి. ఒకవేళ వారు మాపై దాడికి తెగబడితే, 50 రెట్లు శక్తిమంతమైన సమాధానం ఇస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.







