Narendra Modi : వచ్చే నెలలో నరేంద్ర మోదీ .. ట్రంప్ భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తో త్వరలో భేటీ కానున్నారు. వచ్చే నెలలో మలేసియా (Malaysia) వేదికగా జరగనున్న ఆసియాన్ శిఖరాగ్ర సదస్సుకు మోదీ, ట్రంప్‌లు ఇద్దరు హాజరయ్యే సూచనలున్నాయి. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉందని అభిజ్ఞవర్గాల సమాచారం. ఇది ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అనంతరం ఇరువురి నేతల తొలిభేటీ కాబోతోంది. భారత్ పాకిస్థాన్‌ల మధ్య యుద్ధాన్ని తానే విరమింపజేశానని పలు మార్లు వ్యాఖ్యానించిన ట్రంప్- భారత్ పై అధిక సుంకాలూ విధించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరవ్వాలనుకుంటున్నట్లు ట్రంప్ తనకు పోన్ చేసి చెప్పారని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తెలిపారు. అయితే అమెరికా, భారత ప్రభుత్వాలు ఈ విషయంపై ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.