Trump: ఇరాన్ అణుఒప్పందానికి రావాల్సిందే… లేదంటే మరింత తీవ్ర పరిణామాలు తప్పవన్న ట్రంప్

ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) .. మరోసారి గల్ఫ్ దేశానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడుల తీవ్రత ఎంతవరకూ వెళ్తుందో తెలియదని.. అంతకుముందుగానే అణుఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. పరిస్థితి చేయిదాటకముందే తమతో చర్చలు జరపాలన్నారు.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల అనంతరం ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్‌కు ఒక అవకాశం తర్వాత మరో అవకాశం ఇస్తూ వచ్చానన్నారు. యూఎస్‌తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఎన్నిసార్లు సూచించినప్పటికీ అందుకు టెహ్రాన్ అంగీకరించలేదని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని అత్యుత్తమ, అత్యంత ప్రాణాంతకమైన సైనిక పరికరాలను అమెరికా తయారు చేస్తోందని.. అందులో అనేకం ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయని తెలిపారు. వాటిని ఎలా ఉపయోగించాలో కూడా ఆ దేశానికి తెలుసని.. తర్వాత పరిస్థితి తాను ఊహించిన దానికంటే దారుణంగా ఉంటుందని హెచ్చరించారు.
ఇరాన్‌పై దాడి అద్భుతం: ట్రంప్
ఎన్ని చెబుతున్నప్పటికీ కొందరు ఇరాన్ నేతలు తన మాటలు పట్టించుకోకుండా ధైర్యంగా మాట్లాడుతున్నారని ట్రంప్ అన్నారు. కానీ.. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో వారికి కూడా తెలియదన్నారు. ఇరాన్‌లో ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారని.. భారీ విధ్వంసం జరిగిందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మారణహోమం మరింత దారుణంగా మారడానికి కొంత సమయం పడుతుందని.. పరిస్థితులు చేయి దాటకముందే ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు. తాను చెప్పినట్లు చేస్తే ఇక మరణాలు, విధ్వంసాలు ఉండవన్నారు.
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెల్‌అవీవ్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ (Iran) పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ హొస్సేన్ సలామీ మృతి చెందారు. ఆ దేశ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి కూడా మరణించారు. ఇరాన్ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకు ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) పేర్కొన్నారు.