ప్రపంచంలోనే ఉత్తమ దేశం… వరుసగా మూడో ఏడాది
స్విట్జర్లాండ్ ఈ పేరు వినగానే అందమైన ఆల్ప్స్ పర్వతాలు, ప్రకృతి సోయగాలు కళ్లముందు కదలాడుతాయి. పర్యటకులకు స్వర్గధామంగా నిలిచే ఈ చిన్న దేశం తాజాగా అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా నిలిచింది. యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024లో స్విట్జర్లాండ్ అగ్రస్థానం దక్కించుకుంది. వరుసగా మూడో ఏడాది ఈ దేశం నంబర్ వన్‌గా నిలవడం విశేషం. సాహసం, వారసత్వం, వ్యాపార అవకాశాలు , జీవన నాణ్యత పరిమాణాలు, సంస్కృతి, సంప్రదాయలు తదితర అంశాల ఆధారంగా చేపట్టి ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేశారు. మొత్తం 98 దేశాలతో జాబితాను రూపొందించారు. అత్యధిక విభాగాల్లో ఉన్నతంగా ఉన్న స్విట్జర్లాండ్ ఈ జాబితాలో తొలి స్థానం దక్కించుకుంది. ఇప్పటి వరకు మొత్తంగా ఏడుసార్లు ఈ దేశం బెస్ట్ కంట్రీగా నంబర్ వన్ ర్యాంక్‌ను సాధించింది.






