Dubai: భారత్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించలేదా…? షేక్ హ్యాండ్ పై పాక్ కు బీసీసీఐ కౌంటర్..!

ఆసియాకప్ లో పాకిస్తాన్ (Pakistan) పై విజయం తర్వాత టీమిండియా ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించలేదన్న ఆరోపణలు వినవచ్చాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆటగాళ్లు, మాజీలు దీన్నిప్రస్తావించారు. పాకిస్థాన్‌పై విజయం సాధించిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కుల్‌దీప్ యాదవ్‌తోపాటు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) మాత్రమే పోస్ట్ ప్రెజెంటేషన్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పాక్ నుంచి ఎవరూ రాలేదు. అయితే, తమతో టీమ్‌ఇండియా ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడంపై ఏసీసీ వద్ద పాక్ ప్రతినిధులు నిరసన తెలిపారని.. ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. వీటికి కౌంటర్ ఇచ్చేలా భారత క్రికెట్ బోర్డు అధికారి స్పందించారు.
‘‘మీకు ఏదైనా సందేహం ఉంటే ఓసారి రూల్ బుక్‌ను చూసుకోండి. సరిగ్గా చదివితే.. అందులో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వాలని ప్రత్యేకంగా ఏమీలేదు. అదంతా గుడ్‌విల్ మీద ఆధారపడి ఉంటుంది. స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు చేస్తారు. అంతేకానీ, ఇదేమీ చట్టం కాదు. కాబట్టి, భారత క్రికెటర్లు ప్రత్యేకంగా వాళ్లతో కరచాలనం ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని అధికారి పేర్కొన్నారు.
ఆసియా కప్ ప్రారంభానికి ముందు ఎనిమిది జట్ల కెప్టెన్లతో ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. భారత్, పాక్ సారథులు సూర్యకుమార్, సల్మాన్ అఘా పక్కపక్కన కూర్చోలేదు. మధ్యలో అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఉన్నాడు. పీసీ ముగిసిన తర్వాత సల్మాన్‌తో సూర్య కరచాలనం చేశాడు. ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ ఖాన్‌తో షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దీంతో భారత అభిమానుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీంతో మ్యాచ్ రోజున టాస్ తర్వాత ఇచ్చే టీమ్ షీట్ల విషయంలోనూ స్పష్టమైన వ్యత్యాసం కనిపించింది. సాధారణంగా ఇరు జట్ల సారథులు జాబితాను ఇచ్చిపుచ్చుకొనేవారు. కానీ, ఈసారి మాత్రం రెండు షీట్లను రిఫరీకి ఇవ్వడం గమనార్హం.