Black Holes: ఖగోళంలో అరుదైన దృశ్యం.. బ్లాక్ హోల్స్ జోడీని గుర్తించిన సైంటిస్టులు

ఆస్ట్రోనామర్లు ఖగోళ శాస్త్ర చరిత్రలోనే అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ఒకదాని చుట్టూ ఒకటి పరిభ్రమిస్తున్న రెండు భారీ బ్లాక్ హోల్స్‌ను (Black holes) పరిశోధకులు గుర్తించారు. ఆస్ట్రోఫిజికల్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన.. జంట బ్లాక్ హోల్స్ ఉంటాయా? అనే 40 ఏళ్ల ప్రశ్నకు బదులిచ్చింది. భూమి నుంచి 5 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఈ రెండు బ్లాక్ హోల్స్ ఒకదాని చుట్టూ ఒకటి పరిభ్రమిస్తున్నట్లు ఆస్ట్రోనామర్లు (Astronomers) గుర్తించారు.
ఫిన్‌ల్యాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టుర్కుకు చెందిన మారీ వాల్టోనెన్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం.. ఈ నమ్మశక్యం కాని దృశ్యాన్ని ఫొటో తీయగలిగింది. రేడియో టెక్నాలజీ సహాయంతో క్వాజర్ ఓజే287 కేంద్రంలో ఉన్న ఈ రెండు బ్లాక్ హోల్స్‌ను (Black holes) ఈ బృందం గుర్తించింది. వీటిలో పెద్ద బ్లాక్ హోల్ మన సూర్యుడి కన్నా 18 బిలియన్ రెట్లు పెద్దగా ఉంటే.. చిన్న బ్లాక్ హోల్ మన సూర్యడి కన్నా 150 మిలియన్ రెట్లు సైజులో ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇంతకాలం మన పాలపుంతలో, అలాగే మెజీయర్ 87 గెలాక్సీల్లో ఒంటరిగా ఉన్న బ్లాక్ హోల్స్‌ను మాత్రమే గుర్తించారు. ఈ క్రమంలో అసలు జంట బ్లాక్ హోల్స్ (Black holes) ఉంటాయా? అని పరిశోధకులు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. తాజా ఆవిష్కరణతో ఈ ప్రశ్నకు సమాధానం లభించినట్లయింది.
యూనివర్సిటీ ఆఫ్ టుర్కులో (University of Turku) 1982లో మాస్టర్స్ విద్యార్థిగా ఉన్న అయిమో సిల్లాంపా.. తొలిసారి ఓజే287ను గుర్తించగా.. అప్పటి నుంచి దీనిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆప్టికల్ ఇమేజింగ్ (Optical Imaging) కన్నా లక్ష రెట్లు రిజల్యూషన్‌లో పరిశీలించినప్పుడు ఈ బ్లాక్ హోల్స్‌ను గుర్తించారు. 2011 నుంచి 2019 వరకు పనిచేసిన రేడియో ఆస్ట్రన్ శాటిలైట్‌ను ఉపయోగించి ఈ చిత్రాలను తీసినట్లు పరిశోధకులు తెలిపారు.