RIC: రిక్ పునరించే ఉద్దేశ్యంలో రష్యా.. భారత్ కలిసి రావాలని విజ్ఞప్తి..

రిక్ (రష్యా, ఇండియా, చైనా) ఫార్మాట్‌ను పునరుద్ధరించడానికి తాము ఆసక్తిగా ఉన్నామని రష్యా (Russia) విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ పేర్కొన్నారు. ఉరల్ పర్వతాలలోని పెర్మ్ నగరంలో భద్రత, సహకారానికి సంబంధించి ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సామాజిక, రాజకీయ సమావేశంలో లావ్రోవ్ మాట్లాడారు. ఈసందర్భంగా మూడు దేశాల గురించి ఆయన ప్రస్తావించారు.
‘రష్యా, ఇండియా, చైనా అనే రిక్ (RIC) ఫార్మాట్‌ను చాలా ఏళ్ల క్రితం రష్యా మాజీ ప్రధాని యెవ్‌గెని ప్రైమకోవ్ చొరవతో ముందుకుతీసుకెళ్లారు. దీంతో ఈ దేశాల మధ్య ఇప్పటివరకు 20కి పైగా సమావేశాలు జరిగాయి. విదేశాంగ విధానాలకు సంబంధించే కాకుండా మూడు దేశాల ఆర్థిక, వాణిజ్యసంస్థల అధిపతులతో కూడా ఈ చర్చలు జరిగాయి. ఉద్రిక్తత పరిస్థితులు పరిష్కరించుకునే దిశగా భారత్, చైనాలు ఒక అవగాహనకు వచ్చాయి. ఈక్రమంలోనే రిక్ పునరుద్ధరణకు సమయం ఆసన్నమైందని నాకు అనిపిస్తోంది’ అని లావ్రోవ్ పేర్కొన్నారు.
ఈసందర్భంగా ఆయన నాటోపై పలు ఆరోపణలు చేశారు. చైనా (China)కు వ్యతిరేకంగా భారత్ (India)ను మార్చేందుకు నాటో ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. ఇది ఇరుదేశాల మధ్య రెచ్చగొట్టే ధోరణిగా పరిగణించవచ్చన్నారు.
గతేడాది రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సుల్లో భారత ప్రధాని మోడీ (Modi), చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) ప్రత్యేకంగా సమావేశమయిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా తూర్పు లద్ధాఖ్‌లో ఉద్రిక్తతలు చల్లార్చుకొని తమ బలగాలను వెనక్కి రప్పించాలని నిర్ణయించారు. ఈ భేటీ తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు కొంత మెరుగయ్యాయి.