Trilateral Talks: ఉక్రెయిన్ అధ్యక్షుడి నోట త్రైపాక్షిక చర్చల మాట…

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై మూడేళ్లు దాటుతోంది. అయినా ఇరుదేశాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. కానీ.. యుద్ధంలో ఎవరికీ ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదు. దీనికి తోడు యుద్ధంలో విపరీతంగా ప్రాణనష్టం కూడా సంభవిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. దీంతో ఎలాగైనా చర్చలు జరిపి.. ఈ ఉపద్రవం నుంచి బయటపడాలని ఉక్రెయిన్ భావిస్తోంది. దీనికి తోడు ఇన్నాళ్లుగా వెన్నంటి ఉన్న అమెరికా.. ఇప్పుడు చర్చల మంత్రం జపిస్తోంది. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు ట్రంప్.. ఈ సమస్య నుంచిగట్టెక్కిస్తారన్న ఆశలు కూడా కీవ్ లో ఉన్నాయి.
ట్రంప్(Trump) అధ్యక్షుడిగా ఉండడంతో.. ఆయన నుంచి సరైన మద్దతు దక్కడం లేదు. దీనికి తోడు పుతిన్(Putin) చెప్పిన డిమాండ్లకు అంగీకరించాలని ఉక్రెయిన్ పై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో తాము చర్చలకు సిద్దమేనని.. పుతిన్ కే ఇష్టం లేదన్న విషయాన్ని ప్రపంచదేశాలకు అర్థమయ్యేలా చేసేందుకు జెలెన్ స్కీ ప్రయత్నిస్తున్నారు. అందుకే పుతిన్ తో నేరుగా చర్చలు జరుపుతామంటున్నారు. ఈదశలో తొలి అడుగు పడింది కూడా. అయితే అది పూర్తి ఫలితాన్నివ్వలేదు. మరోదఫా చర్చలకు సిద్ధమంటోంది రష్యా.
ఇక యూరోపియన్ యూనియన్(EU) .. ఉక్రెయిన్ కు గట్టి మద్దతుదారుగా ఉంటోంది. కారణం.. యూరోప్ దేశాలుకు పొరుగునే ఉంది ఉక్రెయిన్. ఇప్పుడు యుద్ధంలో ఉక్రెయిన్ కు మద్దతివ్వకుంటే.. తర్వాతి టార్గెట్ తామే అవుతామన్నది యూరోపియన్ దేశాల భయం. అందుకే.. తమ వద్ద ఉన్న ఆయుద సంపత్తిని … యుద్ధంలో సాయంగా అందిస్తున్నాయి కూడా. అయితే.. ఆ దేశాలు కూడా ఎన్నాళ్లిలా సాయం చేస్తాయన్నది కీవ్ భయం. అందుకే చర్చలకు సిద్ధమంటోంది.
అందుకే జెలెన్ స్కీ.. త్రైపాక్షికచర్చల ప్రసక్తి తెచ్చారు.తనతో మాట్లాడడానికి పుతిన్ ఇష్టం లేకపోతే తాను త్రైపాక్షిక చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ‘‘ద్వైపాక్షిక చర్చలకు పుతిన్‌కు ఇష్టం లేకపోతే.. త్రైపాక్షిక చర్చలైనా ఫర్వాలేదు. ఏ తరహా సమావేశానికి అయినా నేను సిద్ధమే’’ అని జెలెన్‌స్కీ ప్రతిపాదించారు. తనతోపాటు పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసి చర్చల్లో పాల్గొనాలనే ఉద్దేశంలో ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు ఉక్రెయిన్‌తో తదుపరి చర్చలు జూన్ 2వ తేదీన జరుపుదామని రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లవ్రోవ్ ప్రతిపాదించారు. ఈ చర్చలకు వాటికన్‌గానీ, జెనీవాగానీ వేదిక కావొచ్చని తెలుస్తోంది.