Virat Kohli: రోహిత్, కోహ్లీ త్వరగా డిసైడ్ అవ్వాలి, మాజీ క్రికెటర్ సలహా..!

టీం ఇండియా స్టార్ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ(Rohit sharma) భవిష్యత్తు విషయంలో క్లారిటీ రాని పరిస్థితి. అసలు వచ్చే వరల్డ్ కప్ వరకు ఈ ఇద్దరూ ఆడతారా లేదా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ప్రస్తుతం లండన్ లోనే ఉంటున్న ఈ ఇద్దరూ అక్టోబర్ లో ఆస్ట్రేలియా(Australia) పర్యటనకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం అదే వారికి ఆఖరి పర్యటన అని జాతీయ మీడియా వర్గాలు అంటున్నాయి. టెస్ట్ లకు, టి20 లకు రిటైర్ అయిన ఈ ఇద్దరూ వన్డేలకు కూడా ఈ ఏడాది రిటైర్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఈ తరుణంలో టీం ఇండియా మాజీ వికెట్ కీపర్ విజయ్ దహియా రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ వన్డే భవిష్యత్తుపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఆడాలా వద్దా అనే దానిపై వీరిద్దరూ తుది నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. ఈ విషయంలో జట్టు యాజమాన్యం కూడా కీలక పాత్ర పోషిస్తుందని దహియా అభిప్రాయపడ్డాడు. అక్టోబర్ 19 నుండి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనున్న నేపధ్యంలో విజయ్ మాట్లాడారు.
ప్రతీ ఒక్కరూ ఏదోక రోజు క్రికెట్ వదలాలని సూచించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫిట్నెస్ పై వారి కెరీర్ ఆధారపడి ఉందని, వారిలో క్రికెట్ పై ప్రేమ ఎంత ఉంది అనేది కూడా ముఖ్యమన్నాడు. వాళ్ళు ఏం చేయాలో, ఏం చేయకూడదో ఎవరూ చెప్పకూడదని అన్నాడు. క్రికెట్ ఆడటం అనేది వారి వ్యక్తిగత విషయమన్నాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది. ఆ తర్వాత వన్డేలకు కొత్త కెప్టెన్ ను నియమించే అవకాశం ఉందని సమాచారం.