Ravi Sastri: కోహ్లీకి గిల్ కు తేడా అదే, రవిశాస్త్రి ఇంట్రస్టింగ్ కామెంట్స్
                                    ఆస్ట్రేలియా సీరీస్ లో ఓటమి తర్వాత భారత జట్టుపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆ పర్యటన లోపాలు సరిదిద్దుకుని ఇంగ్లాండ్ లో అడుగుపెట్టాలని ఎందరో మాజీలు సూచించారు. ఈ తరుణంలో జట్టులో కీలక మార్పులు ఆందోళన కలిగించాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ(Rohith Sharma) టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆ ప్రభావం ఇంగ్లాండ్ పర్యటనలో స్పష్టంగా కనపడుతోంది. ఇంగ్లాండ్ జట్టు 4వ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో 650కి పైగా పరుగులు చేయడం విమర్శలకు దారి తీసింది.
ఈ విషయంలో కెప్టెన్ గిల్(Shubhaman Gill) పై ఆరోపణలు వస్తున్నాయి. సమర్ధవంతంగా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించలేదని, బౌలింగ్ యూనిట్ సమర్ధవంతంగా లేదని మండిపడుతున్నారు మాజీ ఆటగాళ్ళు. తాజాగా దీనిపై మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా ఆసక్తికర కామెంట్స్ చేసాడు. విరాట్ గురించి ఒక ఉదాహరణ చెప్తా అంటూ.. గిల్ లో దూకుడు చాలా తక్కువగా ఉందని అసహనం వ్యక్తం చేసాడు. విరాట్ కోహ్లీ చాలా దూకుడుగా ఉండేవాడని గుర్తు చేసుకున్నాడు. కొన్నిసార్లు డ్రెస్సింగ్ రూమ్ నుండి అతన్ని కంట్రోల్ చేయాల్సి వచ్చేదన్నాడు.
ప్రతి సెషన్లో అతను ఐదు వికెట్లు కోరుకున్నట్లు అనిపించేదని, కాని అలా జరగదని, కొన్ని సార్లు పరిస్థితులను గౌరవిస్తూ అందుకు అనుగుణంగా.. ఫీల్డ్ ను సెట్ చేసుకోవాలని సూచించాడు. కాని గిల్ లో అలాంటిది కనపడలేదన్నాడు. గిల్ తో కెఎల్ రాహుల్, బూమ్రా, జడేజా వంటి వారు మాట్లాడతారని, అలాగే పంత్ కూడా సహకారం అందిస్తాడని, టెస్ట్ క్రికెట్ లో అది చాలా ముఖ్యమన్నాడు. పంత్ కు పెద్ద అనుభవం లేకపోయినా అతనికి పరిజ్ఞానం ఎక్కువ అని కామెంట్ చేసాడు రవిశాస్త్రి. జట్టులో ప్రతీ ఆటగాడు సొంతగా ఆలోచించాలని, ప్రతీదానికి కెప్టెన్ దగ్గరకు వెళ్ళకుండా బౌలర్ దగ్గరకు కూడా వెళ్లి సలహాలు ఇవ్వాలని జట్టుకు సూచించాడు. స్టోక్స్ అదే చేస్తాడని, అలాంటివి చూసి గిల్ నేర్చుకోవాలన్నాడు.







