Delhi: ట్రంప్ ఫోన్ కాల్ కు మోడీ భయపడ్డారా..? రాహుల్ ప్రశ్నల పరంపర..

ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని అందరికీ తెలుసు. అంతెందుకు సాక్షాత్తూ పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ సైతం..తమకు సిందూర్ కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని ఒప్పుకున్నారు. ప్రపంచదేశాలు సైతం.. ఈ దాడిలో పాక్ రక్షణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని వెల్లడించాయి. అయితే కేంద్రం మాత్రం.. పాక్ వైపు నష్టాన్నేచెబుతోంది కానీ.. ఇండియాకు జరిగిన నష్టాన్ని వివరించేందుకు ముందుకు రావడం లేదు. దీంతో యుద్ధంలో మనకు కొన్ని ఫైటర్ జెట్లు నష్టమయ్యాయన్నది దాని సారాంశం.
ఇక దీనికి తోడు సిందూర్ లో విజయం దిశగా సాగుతున్న వేళ.. ప్రధాని మోడీ (Modi) కాల్పుల విరమణ చేసుకున్న సమయంలో.. ఉన్న ఎడ్జ్ ను ఉపయోగించుకోవడంలో ప్రధాని విఫలమయ్యారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎందుకంటే యుద్ధం వద్దు.. సీజ్ పైర్ ముద్దు అని సాక్షాత్తూ పాక్ కాళ్ల బేరానికి వచ్చినప్పుడే .. సమస్య పరిష్కారంపై ఫోకస్ పెట్టాల్సిందంటోంది. అంతేకాదు.. ఇదే అదనుగా పీఓకేను స్వాధీనం చేసుకుని ఉండి ఉంటే.. ఈసమస్య రాదు కదా అని చెబుతోంది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు మోడీ లొంగిపోయారన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోకాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్.. ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ‘‘ఆపరేషన్ సిందూర్ ప్రారంభం కాగానే మోడీకి ట్రంప్ ఫోన్ చేశారు. మోడీజీ.. ఏం చేస్తున్నారు?అని అడిగారు. నరేందర్.. సరెండర్ అన్నారు. వెంటనే మోదీ కాల్పుల విరమణ ప్రకటించారు. ట్రంప్ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించారు’’ అని రాహుల్ ఎద్దేవా చేశారు.
బీజేపీ, ఆరెస్సెస్ నేతలపై కొద్దిపాటి ఒత్తిడి తెచ్చినా వెంటనే లొంగిపోతారని, భయంతో పారిపోతారని, వారి గురించి తనకు బాగా తెలుసని అన్నారు రాహుల్. అదేసమయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీని పొగడ్తలతో ముంచెత్తారు. ‘‘అమెరికా బెదిరింపులను సైతం లెక్క చేయకుండా ఇందిరా గాంధీ హయాంలో 1971లో పాకిస్థాన్‌ను భారత్ విచ్ఛిన్నం చేసిందన్నారు రాహుల్.
అగ్రరాజ్యాలకు తల వంచకుండా పనిచేసింది. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్.. వీరంతా అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధులే’’ అని రాహుల్ చెప్పారు. ఇదీ బీజేపీ, ఆరెస్సెస్ నేతలకు, కాంగ్రెస్ నేతలకు మధ్య ఉన్న తేడా అని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్యోద్యమ సమయం నుంచీ అంతేనని, వారికి లొంగిపోతూ లేఖలు రాయడం అలవాటని వ్యాఖ్యానించారు. కొద్దిపాటి ఒత్తిడి తెచ్చినా లొంగిపోతారని, అది వారి నైజమని విమర్శించారు.