Putin: ఓవైపు చర్చలు.. మరోవైపు దాడులు.. పుతిన్ దౌత్య చతురత

రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) .. ఉక్రెయిన్ యుద్ధంలో వ్యవహరిస్తున్న తీరుతో ప్రపంచానికి తన రాజకీయ చతురత చూపిస్తున్నారు. ఓవైపు యుద్ధంలో భీకర దాడులు కొనసాగిస్తున్నారు. ధిక్కారమున్ సైతునా అంటూ… తనదైనా కర్కశవైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఈ దాడులను చూసిన ప్రపంచం.. క్రెమ్లిన్ తీరుపై ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు.. తమకు పుతిన్ నుంచి ఎప్పటికైనా ముప్పు తప్పదన్న ఆందోళనలతో .. ఆయుధ పోటీకి ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇక రెండో విషయానికి వస్తే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) ఒత్తిడితో .. చర్చలకు తలుపులు తెరిచే ఉంచారుపుతిన్. దీంతో తాము చర్చలకు సిద్ధమంటున్నారు.ఇప్పటికే ఇస్తాంబుల్ లో ఓ దశ చర్చలు సైతం జరిపారు. రెండో దశ చర్చలకు సిద్ధమంటూ రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోయి.. ప్రతిపాదనలు చేశారు కూడా. అంటే.. అంతర్జాతీయ సమాజం ముందు.. తాము శాంతికి వ్యతిరేకం కాదని..రష్యా గట్టిగా చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే పూర్తి అంతర్జాతీయ సమాజం.. తనకు వ్యతిరేకం కాకుండా చూసుకోవడంలో పుతిన్ తనదైన చతురత ప్రదర్శించారు.
అదే సమయంలో యుద్ధ ఖైదీల మార్పిడి ద్వారా.. తాము రక్తపిపాసులం కాదని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. యుద్ధం నిలుపుదల చర్చల సమయంలో ఎంత గట్టిగా వ్యవహరించాలో.. అంతే గట్టిగానూ ఉంటున్నారు. లేటెస్టుగా.. యుద్ధం విరమణకు సైతం.. పుతిన్ సంసిద్ధత వ్యక్తం చేస్తూనే.. షరతులు విధించినట్లు తెలుస్తోంది. అంటే.. యుద్ధం విరమించినా.. దాని ప్రయోజనం గరిష్టంగా తమకే దక్కాలన్నది పుతిన్ వ్యూహంగా కనిపిస్తోంది.
అందుకే అమెరికా సైతం ఇతమిద్దంగా ఎటూ తేల్చుకోలేకపోతోంది.. పాపం ట్రంప్ పరిస్థితి ఎటూ కాని పరిస్థితిలో పడింది. ఫోన్లో మాట్లాడితే అలాగే మీ ఇష్టం అంటారు పుతిన్. తీరా వాస్తవానికి వచ్చేసరికి.. దాడులు కొనసాగుతుంటాయి. చర్చలకు ఆదేశ మంత్రి ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు. కానీ. షరతులు విధిస్తారు. దీంతో ఈ అంశంలో ముందుకు వెళ్లలేక.. వెనక్కు తగ్గలేని స్థితిలో అమెరికా ఉంది. మరి పిల్లిమెడలో గంట కట్టేదెవరు..? పుతిన్ ను దారికి తెచ్చేదెవరు..? దీనికి ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.