Putin conditions: యుద్ధం ఆపేందుకు రష్యా షరతులు…!

కమ్యూనిస్టు దేశం రష్యా .. ఉక్రెయిన్ తో యుద్ధం విషయంలో తన రాజకీయ చతురత ప్రదర్శిస్తోంది. ఓ వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) ప్రత్యక్ష ఒత్తిడితో చర్చలకు సిద్ధమంటూనే.. మరోవైపు ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తోంది. దీంతో పుతిన్ ను అర్థం చేసుకునేందుకు ట్రంప్ .. శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు కూడా. కానీ పుతిన్ రాజకీయ వ్యూహం .. ట్రంప్ కు సరిగ్గా అర్థం కావడం లేదు. అయితే .. యూరోపియన్ యూనియన్ దేశాలు మాత్రం.. రష్యా అధ్యక్షుడి విషయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకునేందుకు సిద్ధంగా లేవు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇలాంటి కీలక తరుణంలో యుద్ధం ముగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్.. కొన్ని షరతులు పెట్టినట్లు రష్యా వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది.పుతిన్ డిమాండ్లు ఏమిటంటే, యుద్ధం ఆపాలంటే తూర్పువైపునకు నాటోను విస్తరించబోమని పశ్చిమ దేశాలు లిఖితపూర్వకంగా హమీ ఇవ్వాలి. మాస్కోపై విధించిన ఆంక్షలను సడలించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వకూడదు. కీవ్ తటస్థంగా ఉండాలి. ఉక్రెయిన్‌లోని రష్యన్లకు భద్రత కల్పించాలి. యూరప్, ఇతర దేశాలు జప్తు చేసిన రష్యా ఆస్తులను విడుదల చేయాలి.
అయితే ఈషరతులకు… ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగాలేవు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినా కూడా.. యూరోపియన్ దేశాలు(EU) అస్సలు అంగీకరించవనే చెప్పాలి. ఇప్పటికే పుతిన్ వైఖరి.. అమెరికా మారుతున్న స్వరంతో ఆ దేశాలు ముందస్తు జాగ్రత్తల్లో ఉన్నాయి. అమెరికా లేకున్నా… యూరోప్ ఏమాత్రం బలహీన ఖండం కాదన్నది స్పష్టంగా చెప్పాలన్నది వాటి ఉద్దేశ్యం. అసలు పుతిన్ కు యుద్ధకాంక్ష అధికంగా ఉందని.. ఎప్పుడైనా తమపైనా దాడులు చేసే పరిస్థితి ఉంటుందన్నది వారి భయం. అందుకే ఇష్టమున్నా, లేకున్నా ఉక్రెయిన్ కు సాయం చేస్తున్నాయి.. చేస్తూనే ఉంటాయి కూడా.
అదీ కాక.. ట్రంప్ ప్రతీది వ్యాపారంలా చూస్తున్నారు. తమ రక్షణ కూడా ట్రంప్ చేతుల్లో ఉంటే… తీవ్రఇబ్బందులు తప్పవన్నది వాటి ఆందోళన. అందుకే.. ఇప్పటికే ఫ్రాన్స్, ఇంగ్లాండ్ లాంటి దేశాలు తమ ఆయుధ పాటవానికి మరింత పదునుపెడుతున్నాయని తెలుస్తోంది. ఓవేళ రష్యా యూరోపియన్ దేశాలపై దాడికి తెగబడితే.. అన్ని దేశాలు కూడా ఎదురుదాడి చేయాలన్నది వాటి లక్ష్యంగా ఉంది.