అమెరికా కోసం ఆ దేశాలు.. మూల్యం చెల్లించుకోవాల్సిందే
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వాదనను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ, ఉక్రెయిన్ కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే మాత్రం వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. టోర్జోక్ ప్రాంతంలో ఉన్న రష్యా వైమానిక స్థావరాన్ని ఆయన సందర్శించారు. అక్కడి పైలట్లతో ముచ్చటించిన ఆయన కొద్దిసేపు సైనిక హెలీకాప్టర్లోని సిమ్యులేటర్‌లో కూర్చుని దాన్ని పరిశీలించారు. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛినమైన తర్వాత అమెరికా నాయకత్వలోని సైనిక కూటమి రష్యా వైపుగా విస్తరించింది. కానీ, నాటో దేశాలపై దూకుడుగా వ్యవహరించాలనే ఆలోచన మాకు లేదు. పోలండ్, చెక్ రిపబ్లిక్‌లపై రష్యా దాడి చేస్తుందని పశ్చిమ దేశాలు పిచ్చి వాదన చేస్తున్నాయి. వాషింగ్టన్‌తో మాస్కో సంబంధాలు ఇంతవరకూ దిగజారలేదు. ఒకవేళ ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపినా, ఎఫ్-16లను ఇచ్చినా వాటిని కూల్చివేయడం ఖాయం. పొరుగు దేశాల నుంచి రష్యాను లక్ష్యంగా చేసుకున్నా, అమెరికా కోసం ఆ దేశాలు మూల్యం చెల్లించుకోవాల్సిందే అని వెల్లడించారు.






