Kuwait: కువైట్ లో మోడీ పర్యటన షురూ…!

ప్రపంచానికి నైపుణ్య రాజధానిగా మారే సత్తా భారత్‌కు(India) ఉందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. రెండ్రోజుల పర్యటన కోసం ఆయన శనివారం కువైట్(Kuwait) సిటీకి చేరుకున్నారు. ప్రవాస భారతీయులతో నిర్వహించిన ‘హలా మోదీ’(ahlan modi) కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. నైపుణ్యం, ప్రతిభ ఇప్పుడు ప్రపంచానికి ఎంతో అవసరమని, మరికొన్ని దశాబ్దాలపాటు ఇలాంటి అవసరాలు తీర్చగలిగే స్థాయి యువత భారతదేశంలో ఉంటారని చెప్పారు.
‘పెద్దసంఖ్యలో భారతీయులను ఇక్కడ చూడటం చాలా ఆనందంగా ఉంది. మినీ భారతదేశం ఇక్కడ కనిపిస్తోంది. భారత్ నుంచి ఇక్కడికి రావడానికి మీ అందరికీ 4 గంటల సమయం పడితే.. ఓ భారత ప్రధాని ఇక్కడికి రావడానికి 4 దశాబ్దాల సమయం తీసుకుంది. ఏటా వందల మంది భారతీయులు ఇక్కడికి వస్తున్నారు. కువైట్ సమాజానికి భారతీయతను అద్దుతున్నారు. భారత ప్రతిభ, సాంకేతికత, సంప్రదాయాల సారాన్ని సమ్మిళితం చేస్తున్నారు. ఈ రెండు దేశాలను దౌత్యసంబంధాలతో పాటు హృదయ సంబంధాలు దగ్గర చేస్తున్నాయి’ అని మోదీ అన్నారు.
43 ఏళ్లలో భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. మహాభారతం, రామాయణాలను అరబిక్ భాషలోకి అనువదించి ప్రచురించిన అబ్దుల్లా అల్ బరౌన్, అబ్దుల్ లతీఫ్ అల్ నెసెఫ్‌లను మోడీ అభినందించి, ఆ గ్రంథాలపై సంతకం చేశారు. విశ్రాంత ఐఎఫ్‌ఎస్ అధికారి మంగళ్‌సేన్ హండా (101) మనవరాలు ‘ఎక్స్’లో చేసిన వినతి మేరకు మోడీ ఆయన్ని కలిశారు. భారత అభివృద్ధికి ఆయన తపనను తప్పకుండా ప్రశంసించాల్సిందేనన్నారు. భారతీయ కార్మికులు ఆశ్రయం పొందిన ఒక శిబిరాన్ని మోడీ సందర్శించి వారితో ముచ్చటించారు. అరేబియన్ గల్ఫ్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంటును ప్రారంభించారు.
ఇంధన రంగంలో బలమైన, చారిత్రకమైన బంధాలున్న భారత్-కువైట్ దానిని భాగస్వామ్యంగా మార్చుకునే అవకాశం ఉందని కువైట్ వార్తాసంస్థ ‘కునా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ చెప్పారు. గాజా, ఉక్రెయిన్‌లలో శాంతి స్థాపనకు దోహదపడే ప్రయత్నాలను భారత్ కొనసాగిస్తుందన్నారు. గల్ఫ్‌లో నివసిస్తున్న 90 లక్షల మంది భారతీయులు.. ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నారని చెప్పారు.