Islamabad: ఉగ్రమూకలు, హైజాకర్ల రక్షణకు పాక్ ప్రయత్నాలు.. చట్టాన్నే సవరించిన పొరుగుదేశం…

పాకిస్తాన్ (Pakistan), ఉగ్రవాదులతో ఉన్న సంబంధం చూస్తుంటే సయామీ కవలలే గుర్తొస్తారు. ఎందుకంటే వారి బంధం విడదీయరానంత స్ట్రాంగ్ గా ఉంటుంది. పాకిస్తాన్, ఉగ్రవాదుల మధ్య కూడా అంతే. ఎందుకంటే ఉగ్రవాదులను పెంచి, పోషించి… ఆయుధాలు సరఫరా చేసి దాడులకు పురమాయించేది పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ. అందువల్లే ఉగ్రవాదులకు పాక్ గడ్డపై సకల రాజమర్యాదలు అందుతాయి. అంతేనా జిహాదీ పేరుతో సంఘంలో గౌరవం లభించేలా చూస్తారు.అందుకే ఆదేశం.. ఉగ్రవాదులకు పురిటిగడ్డగా మారింది.
ఇప్పుడు ప్రపంచం మొత్తం పాకిస్తాన్ ను ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా పరిగణిస్తోంది. దీంతో దాన్నుంచి తప్పించుకోవడానికి పాక్ నేతలు.. ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అయితే వారేమీ మాట్లాడినా ప్రపంచం మాత్రం పాక్ మాటలను నమ్మడం లేదు. ఇప్పుడు దానికి బలం చేకూర్చేలా ఉగ్రవాదులకు, హైజాకర్లకు ఆశ్రయం కల్పించేవారికి విధించే మరణశిక్షను సైతం రద్దు చేసింది పాక్. ప్రభుత్వ నిర్ణయానికి పాక్ సెనెట్ ఆమోద ముద్ర కూడా వేసేసింది.
పాక్ పీనల్ కోడ్ చట్టాల ప్రకారం.. హైజాకింగ్‌కు పాల్పడిన వ్యక్తికి ఉద్దేశపూర్వకంగా ఆశ్రయం కల్పిస్తే గరిష్ఠంగా మరణశిక్ష ఎదుర్కొంటారు. ఇక, బహిరంగంగా మహిళపై బలప్రయోగం చేసి ఆమెను వివస్త్రను చేస్తే గతంలో ఏడేళ్ల జైలు శిక్ష ఉండేది. 1983లో జనరల్ జియా ఉల్‌హక్ పాలనలో దాన్ని మరణశిక్షగా మార్చారు. అయితే, ఈతరహా నేరాల్లో శిక్షను తగ్గించాలని పాకిస్థాన్‌లో కొంతకాలంగా డిమాండ్లు మొదలయ్యాయి.
ఈక్రమంలోనే తాజాగా క్రిమినల్ చట్ట సవరణ బిల్లు 2025ను తీసుకొచ్చారు. అందులో హైజాకర్లకు ఆశ్రయం కల్పించడం, మహిళలను బహిరంగంగా వివస్త్రను చేయడం వంటి నేరాల్లో దోషులుగా తేలిన వారికి శిక్షలను తగ్గిస్తూ ప్రతిపాదనలు చేశారు. ఇందుకు పాక్ సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ నేరాలకు మరణశిక్షలను తొలగించి.. దాని స్థానంలో దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేసింది. అత్యంత తీవ్రమైన నేరాల్లో మాత్రమే మరణశిక్ష విధించేలా సవరణ బిల్లును రూపొందించింది. త్వరలోనే ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. అయితే, దీనిపై విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా పాక్ ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోలేదు.
పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. ఇటీవల పహల్గాం ఉగ్రదాడితో ఇది మరోసారి బహిర్గతమైంది. భారత్‌లో పలు మారణహోమాలకు కారణమైన లష్కరే తొయ్యిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర ముఠాలు పాక్ గడ్డ నుంచే తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. లష్కరే అధినేతను జైల్లో పెట్టామని దాయాది చెబుతున్నప్పటికీ.. అతడికి అక్కడ రాచమర్యాదలు అందుతున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఇక, జైషే చీఫ్ మసూద్ అజార్‌కు స్వయంగా పాక్ ప్రభుత్వమే పటిష్ట భద్రతను కల్పిస్తున్నట్లు ఇటీవల పలు కథనాలు వెలువడ్డాయి.