Bangladesh: పాకిస్తాన్ వయా బంగ్లాదేశ్… తెహ్రీకే తాలిబన్ లక్ష్యమేంటి..?

తెహ్రీకే ఈ తాలిబన్ పాకిస్థాన్(TTP).. ఆఫ్గన్ గడ్డపై నుంచి ఆపరేటింగ్ అవుతున్న ఈఉగ్రవాద సంస్థ.. పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది. నేరుగా ఆదేశ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నే టార్గెట్ చేసి.. తానేంటో అర్థమయ్యేలా చేసింది. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో పాక్ ఆర్మీపై, పోలీసు బలగాలను టార్గెట్ చేస్తోంది. దీంతో తెహ్రీకే తాలిబన్ పాకిస్తాన్ పేరు చెబితేనే పాక్ సేనలు వణుకుతున్నాయి. ఇప్పుడు ఆ సంస్థ తన కార్యకలాపాలను బంగ్లాదేశ్ కు విస్తరిస్తోంది.
ఇటీవల కాలంలో ఇద్దరు బంగ్లాదేశీలు పాక్ మీదుగా అఫ్గానిస్థాన్‌కు చేరుకొన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరిలో ఒకరు వజీరిస్థాన్‌లో పాక్ సైన్యంతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. మరోవైపు అదే సమయంలో మిలిటెంట్ నెట్‌వర్క్‌లతో సంబంధాలున్న 36 మంది బంగ్లాదేశీయులను మలేసియాలో అరెస్టు చేశారు.
హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత స్థానిక జిహాదీ గ్రూపులు బలపడుతున్న వేళ.. టీటీపీ ఇక్కడ చేరింది. జులైలో.. బంగ్లాదేశ్(Bangladesh) యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ షమిన్ మహఫుజ్, ఎండీ ఫైసల్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. వీరికి టీటీపీతో సంబంధాలున్నాయని డెయిలీ స్టార్ పత్రిక పేర్కొంది. ఇప్పటి వరకు కనీసం 8 మంది బంగ్లాదేశ్ వాసులు టీటీపీలో చురుగ్గా ఉన్నట్లు ఆ దేశ ఇంటెలిజెన్స్ గణాంకాలు చెబుతున్నాయి. గతంలో కూడా బంగ్లాదేశ్ వాసులు విదేశీ ఉగ్రసంస్థలతో సంబంధాలు పెట్టుకున్నారు. 2016లో ఢాకాలో జరిగిన పేలుడులో 22 మంది చనిపోయారు.
జులై 14వ తేదీన బంగ్లా యాంటీ టెర్రర్ యూనిట్ షమాని మహఫుజ్‌ను నారాయణ్ గంజ్‌లో అరెస్టు చేసింది. అతడికి టీటీపీతో సంబంధాలు ఉన్నట్లుపేర్కొంది. గతంలో అతడు జమాత్‌ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్‌లో వ్యవస్థాపకుడు. ఆ తర్వాత జమాత్ ఉల్ అన్సారీ ఫిల్ హిందల్ షరాకియా అనే సంస్థను స్థాపించాడు.2014లో ఉగ్ర నియమాకాలు చేపట్టినందుకు, 2023లో పేలుడు పదార్థాలు ఉన్నందుకు అతడిని అరెస్టు చేశారు.
అతడిని 2024 అక్టోబర్‌లో బెయిల్‌పై విడుదల చేశారు. అతడికి కుకీ-చాన్ నేషనల్ ఫ్రంట్ నేత నాథన్ బోమ్‌తో సంబంధాలున్నాయి. దీనికి చిట్టగాంగ్ హిల్ ప్రాంతంలో ట్రైనింగ్ క్యాంప్‌లు ఉన్నాయి. ఇక తాజాగా అరెస్టు అయిన ఎండీ ఫైసల్ అఫ్గానిస్థాన్‌కు వెళ్లి వచ్చాడు. ఇతడితోపాటు అహ్మద్ జుబైర్ అనే వ్యక్తి ఉన్నా.. అతడు పాక్ ఆర్మీ వజీరిస్థాన్‌లో చేపట్టిన ఆపరేషన్‌లో చనిపోయాడు. వీరిని అఫ్గానిస్థాన్‌లోని ఏరోనాటికల్ ఇంజినీర్ ఇమ్రాన్ హైదర్ టీటీపీలో చేర్చుకొన్నాడు. బంగ్లాదేశ్ నుంచి వచ్చేవారిని జిహాద్‌కు సిద్ధం చేయడంలో అతడిదే కీలక పాత్రగా తెలుస్తోంది.