Ind vs Pak: ఐసీసీకి పాకిస్తాన్ వార్నింగ్, రిఫరీని తొలగించాల్సిందే..!

అంతర్జాతీయ క్రికెట్ లో పాకిస్తాన్ జట్టుది ప్రత్యేక శైలి. ఆ దేశ వైఖరి కూడా అలాగే ఉంటుంది. భారత్(Bharath) విషయంలో నిత్యం విషం కక్కుతూ.. మనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసే ఆ దేశంతో భారత్ కఠినంగానే వ్యవహరిస్తోంది. అయితే తాజాగా పాకిస్తాన్ తో ఆసియా కప్ లో భారత్ తలపడింది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. భారత్ ఆడకుండా ఉండాల్సింది అనే అభిప్రాయాలు వినిపించాయి. ఈ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
ఇక మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్ళు పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విమర్శలు చేస్తోంది. ఈ విషయంలో ఆ దేశ బోర్డు కాస్త తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసినట్టు సమాచారం. భారత జట్టుపై మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ కు ఫిర్యాదు చేసిన తర్వాత.. రిఫరీని ప్యానెల్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. డిమాండ్ విషయంలో ఐసీసీ వెనక్కు తగ్గకపోతే టోర్నీ నుంచి తప్పుకుంటామని హెచ్చరించింది పాకిస్తాన్.
టాస్ వేసేటప్పుడు కరచాలనం చేయకపోవడాన్ని కూడా పాకిస్తాన్ సీరియస్ గా తీసుకుంది. ఆ సమయంలో మ్యాచ్ రిఫరీ భారత్ కు అనుకూలంగా వ్యవహరించాడు అని పాకిస్తాన్ మండిపడింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి మరియు క్రికెట్ స్ఫూర్తికి సంబంధించిన చట్టాలని రిఫరీ ఉల్లంఘించారు అని పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పైక్రాఫ్ట్‌ను రిఫరీ ప్యానెల్ నుండి తొలగించకపోతే సెప్టెంబర్ 17న యుఎఇతో జరిగే తదుపరి మ్యాచ్ ను బహిష్కరిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. కాగా మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్ళు నేరుగా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్ళగా పాకిస్తాన్ ఆటగాళ్ళు కరచాలనం కోసం ఎదురు చూసారు. కెప్టెన్ తో పాటుగా మిగిలిన ఆటగాళ్ళు అందరూ వేచి చూసినా భారత్ నుంచి మాత్రం స్పందన రాకపోవడంతో వాళ్ళు వెనుతిరిగారు.