ఇక పాకిస్తాన్‌తో చర్చల్లేవు: విదేశాంగ మంత్రి జైశంకర్
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగారు. టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌తో ఇక చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పారు. జైశంకర్ ప్రస్తుతం 3 రోజుల సింగపూర్ పర్యటనలో ఉన్నారు. అక్కడి సింగపూర్ నేషనల్ యూనివర్శిటీలో ఆయన రాసిన పుస్తకం ‘వై ఇండియా మేటర్స్’పై జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ టెర్రరిజానికి మద్దతిస్తున్న పాకిస్తాన్ తీరును ఎండగట్టారు.
ప్రపంచంలోని ప్రతి దేశం తన ఇరుగుపొరుగు దేశాలు స్థిరంగా ఉండాలని, కనీసం శాంతియుతంగా ఉండాలని కోరుకుంటాయన్న జైశంకర్.. పాకిస్తాన్ వంటి దేశం పొరుగున ఉండడం భారతదేశ దౌర్భాగ్యమన్నారు. పాక్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోందని, ఎంత వారించినా.. హెచ్చరించినా తన దుర్మార్గపు కార్యకలాపాలను వదులుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఇకపై భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని కానీ, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలను కానీ ఏ మాత్రం ఉపేక్షించబోదని ఆయన స్పష్టం చేశారు.
‘‘ఉగ్రవాదంతో పాకిస్థాన్‌కున్న సంబంధం నేటిది కాదు. ఇది నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. బహిరంగంగానే ఉగ్రవాదాన్ని పాలనా సాధనంగా ఉపయోగించుకుంటున్న పొరుగు దేశంతో ఎలా వ్యవహరించాలి? అందుకే ఈ ముప్పును పరిష్కరించేందుకు ఇకపై కఠిన నిర్ణయాలు తీసుకుంటాం. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్‌పై కేవలం విమర్శలు చేస్తూ చర్చలు కొనసాగించడానికి భారత్ ఇక ప్రయత్నించదు ’’ అంటూ భారత విదేశాంగ మంత్రి పాకిస్తాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు.






