Pakistan: సింధూ జలాల ఒప్పందంపై కాళ్ల బేరానికి పాక్..?

యుద్ధమంటే సై అంటోంది.. ఎన్ని చెప్పినా అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతోంది. ఏ విషయంలోనూ ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గడం లేదు. అలాంటి పాకిస్తాన్ (Pakistan) కేవలం సిందూ నది జలాల విషయంలో మాత్రం తీవ్రంగా ఆందోళన చెందుతోంది. తాగునీరు, సాగునీరు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పాక్.. వేరే ఆప్షన్ లేకపోవడంతో కాళ్లబేరానికి వస్తోంది. దేహీ అంటూ భారత్‌కు 4 లేఖలు రాసింది. సింధూనది జలాల ఒప్పందం నిలిపివేత విషయంలో నిర్ణయాన్ని మళ్లీ సమీక్షించాలని కోరుతూ లెటర్స్ రాసింది శత్రుదేశం. ఇందులో ఒక లేఖ మే నెల మొదట్లో రాయగా.. మిగతా మూడు కూడా ఆపరేషన్ సిందూర్ అనంతరం రాసినట్లు సమాచారం.
భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాకిస్థాన్ జలవనరుల శాఖ నుంచి 4 లేఖలు అందాయని తెలుస్తోంది. సింధూ జలాలను నిలిపివేయడంతో తమ దేశంలో తీవ్ర దుర్భిక్షం నెలకొందంటూ ఈ లేఖల్లో పాక్ పేర్కొన్నట్లు సమాచారం. ఈ అంశం మీద చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ లేఖల్లో శత్రుదేశం పేర్కొంది. పాక్ జలవనరుల శాఖ నుంచి వచ్చిన ఈ లేఖల్ని ప్రోటోకాల్‌లో భాగంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
కాగా, ఉగ్రవాదం-వాణిజ్యం కలసి వెళ్లలేవని, నీరు-రక్తం కలసి ప్రవహించలేవని ప్రధాని నరేంద్ర మోడీ (Modi) తేల్చిచెప్పారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు సింధు జలాల విషయంలో తమ నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండడోదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నీళ్లు వదలండి అంటూ పాక్ నుంచి లేఖలు రావడం ఆసక్తిని సంతరించుకుంది.