America : అమెరికా గడ్డ పైనుంచి భారత్‌కు హెచ్చరిక …పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్

భారత్‌పై అణుబాంబులు వేస్తామని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ (Asim Munir) హెచ్చరించారు. అమెరికా గడ్డ పైనుంచి భారత్ (India)కు హెచ్చరికలు జారీచేశారు. పాకిస్థాన్ ఉనికికే ముప్పు వాటిల్లితే, సగం ప్రపంచాన్ని తమ వెంట తీసుకెళ్తామంటూ పైశాచికంగా మాట్లాడారు. అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్కామ్) మైఖేల్ కురిల్లా పదవీ విరమణ, ఆయన స్థానంలో అడ్మిరల్ బ్రాడ్ కూపర్ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మునీర్ పాల్గొన్నారు. అనంతరం మిత్రదేశాల రక్షణ శాఖల అధిపతులతో సమావేశమై, చర్చలు జరిపారు. గ్రాండ్ హయాత్ హోటల్‌లో ప్రవాస పాకిస్థానీలతో భేటీ అయ్యారు. ఆయా సందర్భాల్లో ఆయన భారత్‌ను లక్ష్యంగా చేసుకుని, తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా గడ్డ పైనుంచి ఒక దేశానికి అణు బెదిరింపులు చేయడం గతంలో ఎన్నడూ జరగలేదు. భారత్ సింధూజలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై మునీర్ తీవ్రంగా మాట్లాడారు. సింధూనది భారతీయుల ఆస్తి కాదు. భారత ప్రభుత్వం సింధూ జలాలను ఆపడం వల్ల 25 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం పడుతుంది. వారు(భారత్) ఆనకట్టలు నిర్మిస్తే, మేం క్షిపణులతో పేల్చేస్తాం. పాకిస్థాన్ వద్ద క్షిపణులకు కొదవ లేదు అని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ఉనికికి ముప్పు ఏర్పడితే, భారత్‌పై అణుబాంబులు(Nuclear bombs) వేసేందుకు వెనకాడబోమని, తాము మునిగిపోతూ, సగం ప్రపంచాన్ని తమతో తీసుకెళ్తామని చెప్పారు.