Israel-Gaza: గాజా ఘోరకలికి సామాన్యులే సమిధలు.. మృత్యుభూమిలో ఆకలికేకలు..

గాజా (Gaza) ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం. ఎప్పుడు ఎక్కడి నుంచి బాంబులు పడతాయో తెలియదు. ఎటువైపు నుంచి మిస్సైల్స్ దాడులు జరుగుతాయో తెలియదు. వీటన్నింటికీ మించి.. తమ పిల్లలను ఎక్కడ భద్రంగా ఉంచాలో అర్థం కాక.. గాజా ప్రజలు తల్లడిల్లుతున్నారు. పైనేమో మృత్యువిహంగాల్లా తిరుగుతున్న యుద్ధవిమానాలు, డ్రోన్లు.. ఇంకోవైపు.. ఆహార కేంద్రాల దగ్గరకు వెళ్లకుంటే కడుపును మండించే ఆకలి.. దీంతో పిల్లలకోసమైనా తప్పదన్న వేదనతో ఆహార కేంద్రాల దగ్గర పడిగాపులు పడుతున్నారు.
ఇజ్రాయెల్ (Israel) తో యుద్ధం గాజాలో సామాన్యులకు శాపంగా మారింది. ఆహార ధరలు విపరీతంగా పెరగడంతో అక్కడి వారు అల్లాడిపోతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కనుచూపు మేరలో లేకపోవడంతో జనాల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి.జాతీయ మీడియా కథనాల ప్రకారం, గాజాలో ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి. భారతీయ కరెన్సీ ప్రకారం, అక్కడ కిలో చక్కెర ధర ఏకంగా రూ.4914కు చేరింది. అలాగే కేజీ వంట నూనె ధర రూ.4177, కిలో పాల పొడి ధర రూ.860కు పెరిగింది. గోధుమపిండి కిలో రూ.1474, కేజీ ఉప్పు రూ.491 కాగా.. టమాటాల ధర రూ.1106గా ఉంది. ఇక ఉల్లిపాయలు, బంగాళా దుంపలు వంటి కూరగాయలన్నీ దాదాపుగా రూ.1000 దాటిపోయాయి. దీంతో, సామాన్యులు తమకు దిక్కెవరంటూ అలమటిస్తున్నారు.
తాజా పరిస్థితికి ఇజ్రాయెల్, హమాస్ ఒకరినొకరు బాధ్యులను చేసే ప్రయత్నం చేస్తున్నాయి. గాజాకు పంపిస్తున్న మానవతా సాయాన్ని హమాస్ దోపిడీ చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఆహారం తరలిస్తున్న ట్రక్కులను లూటీ చేస్తోందని తెలిపింది. ఇలా దొంగిలించిన ఆహారాన్ని గాజాలోని స్థానికులకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటోందని మండిపడింది.
ఇప్పటివరకూ గాజాకు పంపించిన ఆహార ట్రక్కుల్లో 80 శాతం వాహనాలను హమాస్ దోచుకుందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఈ అక్రమ దందాలతో గాజాలో ప్రజలపై తన రాజకీయ, ఆర్థికపట్టును నిలుపుకుంటోందని ఇజ్రాయెల్ అధికారులు చెప్పుకొచ్చింది. మాస్కులు ధరించిన హమాస్ ఉగ్రవాదులు తుపాకీలతో ట్రక్కులను దోచుకుంటున్నారని మండిపడింది. ఇక ఉత్తర గాజా నుంచి తమ భూభాగంపై రాకెట్‌లు ప్రయోగించారనీ ఇజ్రాయెల్ ఆరోపించింది. ఈ మేరకు ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది.
ఇక సెప్టెంబర్ నాటికి గాజాలో సుమారు 5 లక్షల మంది తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కుంటారని ఎఫ్ఏఓ హెచ్చరించింది. ఇక తాము ఇప్పటివరకూ ఒక్కొక్కరికీ 3500 కెలొరీల చొప్పున ఆహారాన్ని పంపించామని కూడా ఇజ్రాయెలీ అధికారులు చెబుతున్నారు. అదంతా తిని ఉంటే అక్కడి వారు లావైపోయి ఉండేవారని కూడా పేర్కొన్నారు.