Operation lion: ఆపరేషన్ రైజింగ్ లయన్.. దటీజ్ ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొస్సాద్ స్పెషల్…

పశ్చిమాసియాలోని ప్రత్యర్థులను దెబ్బతీయడంలో ఇజ్రాయెల్ మరోసారి తన స్ట్రాటజీస్ ప్రయోగించింది.
ముఖ్యంగా.. ఇరాన్(Iran)పై తాజాగా చేపట్టిన ఆపరేషన్ ‘రైజింగ్ లయన్’ కోసం చాలాకాలం నుంచే పావులు కదిపినట్లు తెలుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని, సైనిక బలాన్ని దృష్టిలో పెట్టుకుని భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందు కోసం అవసరమైన ఆయుధ వ్యవస్థలు, పరికరాలు, కమాండోలను రహస్య మార్గాల్లో ఇరాన్‌లోకి చేరవేయడంలో ఇజ్రాయెల్ గూఢచర్య విభాగం మొస్సాద్ కీలకపాత్ర నిర్వర్తించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు అత్యంత సమీపంలోనే డ్రోన్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. అత్యంత కచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలను అక్కడికి చేర్చింది. ఆపరేషన్ ‘రైజింగ్ లయన్’ మొదలుకాగానే ఇక్కడి నుంచి డ్రోన్లను ప్రయోగించి…ఇరాన్ క్షిపణి స్థావరాలను ధ్వంసం చేసింది. గగనతల రక్షణ వ్యవస్థలనూ నాశనం చేసింది. మధ్య ఇరాన్‌లోని విమాన విధ్వంసక కేంద్రాల వద్ద ఇజ్రాయెల్ కమాండోలు అత్యంత కచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలను మోహరించి దాడులు చేశారు. ఆ తర్వాత యుద్ధ విమానాలు, క్షిపణులతో ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలు, సైనిక స్థావరాలు, మిలటరీ కార్యకలాపాల ప్రధాన కేంద్రాలపై టెల్ అవీవ్ విరుచుకుపడింది. మొత్తం ఐదు దశల్లో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైనిక వర్గాలు వెల్లడించాయి.
ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం కావడంతోనే ఆ దేశ అణు శుద్ధి కేంద్రాలపై నిరాటంకంగా ఇజ్రాయెల్ జెట్లు పలుమార్లు దాడులు చేయగలిగినట్లు తెలుస్తోంది. ఇరాన్ అణు కేంద్రాల్లో అత్యంత ప్రధానమైన, నేలమాళిగలో నిర్వహిస్తోన్న నతాంజ్ ప్రాంతంలోని యురేనియం శుద్ధి కర్మాగారంతో పాటు ఇస్ఫహాన్‌లోని కేంద్ర వద్ద కూడా పేలుళ్లు సంభవించినట్లు సమాచారం.
ఆపరేషన్ రైజింగ్ లయన్‌లో భాగంగా ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ నుంచి భారీఎత్తున ఫైటర్ జెట్ల దండు వెళ్లింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫ్ఫే డెఫ్రిన్ వెల్లడించారు. ఇజ్రాయెల్ వాయుసేనలో ఫైటర్‌జెట్లు, రీఫ్యూయలర్లు, నిఘా వంటి వివిధ రకాలకు చెందిన 200 యుద్ధ విమానాల దండు ఇరాన్‌పైకి వెళ్లిందన్నారు. మొత్తం 100 లక్ష్యాలపై ఇవి దాడులు చేసినట్లు చెప్పారు. ఇందుకోసం 330 బాంబులు, క్షిపణులను వాడినట్లు వివరించారు. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన కీలకమైన సైనిక విభాగాల అధిపతులు ముగ్గురు, పలువురు సైన్యాధికారులు మృతి చెందారు.
గతంలోనూ కోవర్టు ఆపరేషన్లు..
గత ఏడాది ఏప్రిల్, అక్టోబర్‌లలో ఇరాన్‌పై దాడులకు ముందు కూడా ఇజ్రాయెల్ గూఢచారి విభాగం.. మొస్సాద్ కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించింది. 2018లో ఇరాన్ అణు రహస్యాలను ఈ నిఘా సంస్థ దొంగిలించింది. దీంతోనే టెహ్రాన్ అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ప్రపంచానికి చూపించింది. 2022లో నిర్వహించిన మిలిటరీ ఆపరేషన్‌లో ఇరాన్‌కు చెందిన 100 డ్రోన్లను ధ్వంసం చేసింది. 2023లో కూడా మొస్సాద్ తమ దేశంలో ఇలాంటి ఆపరేషన్ నిర్వహించినట్లు ఇరాన్ ఆరోపించింది. 2020లో ఇరాన్ అగ్రశ్రేణి అణుశాస్త్రవేత్త మొహసెన్ ఫక్రిజాదను మొస్సాద్ హత్య చేసింది.