US Visa: వీసాతో అయిపోలేదు.. పొంచి ఉన్న బహిష్కరణ ముప్పు..

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Trump) బాధ్యతలు చేపట్టిన నాటినుంచి వలసదారులపై కఠిన వైఖరి అనుసరిస్తున్నారు. ఇప్పటికే వీసాల (US visa) జారీకి ‘సోషల్ మీడియా వెట్టింగ్’ను తప్పనిసరి చేశారు. అయితే, వీసా పొందిన తర్వాత కూడా నిబంధనలు పాటించకపోతే ‘బహిష్కరణ ముప్పు’ తప్పదని అగ్రరాజ్యం తాజాగా హెచ్చరించింది. ఈ మేరకు భారత్‌లోని యూఎస్ రాయబార (US Embassy in India) కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసింది.
‘‘వీసా మంజూరుతోనే వలసదారులపై స్క్రీనింగ్ ఆగిపోదు. వారి ప్రతి కదలికను నిశితంగా గమనిస్తూనే ఉంటాం. అమెరికా చట్టాలు, ఇమిగ్రేషన్ నిబంధనలను వీసాదారులు తప్పనిసరిగా పాటించాల్సిందే. వాటిని అతిక్రమిస్తే మాత్రం తక్షణం వీసాలను రద్దు చేసి దేశం నుంచి వెళ్లగొడతాం’’ అని ఎంబసీ తమ పోస్ట్‌లో స్పష్టంచేసింది.
వీసా దరఖాస్తుదారులు తప్పనిసరిగా తమ ఐదేళ్ల సోషల్ మీడియా ఖాతాలను సమర్పించాల్సి ఉంటుందని ఇటీవల అమెరికా వెల్లడించింది. ఫేస్‌బుక్, లింక్డిన్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలనూ, అందులో అభ్యర్థులు చేసిన పోస్టులు, కామెంట్లు, వెల్లడించిన అభిప్రాయాలనూ అగ్రరాజ్య అధికారులు పరిశీలిస్తారు. అలా అని వాటిలో ఉన్న పోస్టులు ఏవీ ఇప్పుడు డిలీట్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేసినట్టు కనిపిస్తే పరిశీలన మరింత లోతుగా వెళ్లి తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. ఈ వివరాలను ఇవ్వకపోతే వీసా తిరస్కరిస్తారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నట్టు కనిపించిన వ్యక్తులను దేశంలోకి రాకుండా చూడటం కోసం ఈ ‘సోషల్ మీడియా వెట్టింగ్’ను అగ్రరాజ్యం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.