వాళ్ళపై నిషేధం లేదు…రావచ్చు

భారత్‍లో కరోనా తీవ్రత కారణంగా అమెరికా భారతీయుల ప్రవేశంపై విధించిన ఆంక్షలు అందరికీ కాదని, అమెరికాకు వచ్చేందుకు ఇప్పటికే అనుమతి ఉన్న హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులు ఎలాంటి అంతరాయం లేకుండా అమెరికాకు రావచ్చని వారిపై ఎలాంటి నిషేధం లేదని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. అమెరికాలో ఉంటున్న అమెరికా మైనర్ పౌరుల ఇతర దేశాల తల్లిదండ్రుల ప్రయాణాలకు సైతం ఎలాంటి ఆంక్షలు లేవని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. కాకపోతే ఇలాంటి వారు అమెరికా ప్రయాణాలకు సిద్ధమైతే తగిన రుజువులు దగ్గర ఉంచుకోవాలని ట్విటర్ ద్వారా పేర్కొంది. ఈ వార్త ఎంతోమంది వీసాదారులకు ఊరటనిచ్చింది.
అలాగే స్టూడెంట్ వీసా ఉన్న భారతీయ విద్యార్థులకు కూడా ఆంక్షల నుంచి మినహాయింపు కల్పించింది. అమెరికాలో అడ్మిషన్ పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీలో ఆగస్టు 1వ తేదీ, తర్వాత క్లాసులు ప్రారంభమైతే, అలాంటి విద్యార్థులు అమెరికా వెళ్లొచ్చు. ఎఫ్-1, ఎం-1 వీసాలున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. వీరు అమెరికా వెళ్లడానికి భారత్‍లోని యూఎస్ ఎంబసీలనుగానీ, కాన్సులేట్‍నుగానీ సంప్రదించాల్సిన అవసరం లేదు. ఆగస్టు 1 కంటే ముందు క్లాసులకు హాజరుకావాల్సి ఉన్న విద్యార్థులు మాత్రం సంబంధిత విద్యాసంస్థలను సంప్రదించాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.